హైదరాబాద్: అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లింగం పాతబస్తీలోని ఓ అపార్టుమెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, శారద జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తున్నది. పెద్ద కూతురు మనీషాకు వివాహం చేశారు. అయితే ఆమె తన భర్త స్నేహితుడు మహ్మద్ జావీద్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి (Extramarital Affair ) దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను వదిలేశాడు. దీంతో అప్పటి నుంచి ప్రియుడితో కలిసి మౌలాలీలో ఉంటున్నది. అయితే వీరి అక్రమసంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తండ్రి.. పలుమార్లు కూతురిని మందలించాడు. ఇదే విషయాన్ని తన తల్లి శారద దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో అతని అడ్డు తొలగించుకుంటే వారి జీవితం సాఫీగా సాగుతుందని భావించిన తల్లీకూతుళ్లు.. జావీద్తో కలిసి లింగంను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. పథకం ప్రకారం జూలై 5న తండ్రి తాగే కల్లులో నిద్రమాత్రలు కలిపారు. దానిని తాగిన లింగం నిద్రలోకి జారుకున్నారు. అనంతరం ముగ్గురూ కలిసి అతని ముఖంపై మెత్త ఉంచి ఊపిరాడకుండా చేశారు. అయితే మరణించకపోవడంతో ఛాతీపై బలంగా పిడిగుద్దులు బలంగా గుద్ది, తాడుతో మెడకు ఉరి బిగించి హత్య చేశారు. చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత ముగ్గురూ కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు.
అర్ధరాత్రి ఇంటికి తిరిగివచ్చి ఓ క్యాబ్ మాట్లాడుకుని మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే క్యాబ్ డ్రైవర్ కు అనుమానం రావడంతో కల్లు తాగి మత్తులో ఉన్నాడని అతనికి చెప్పి నమ్మించారు. కారులో ఎదులాబాద్ తీసుకెళ్లి అక్కడి చెరువులో మృతదేహాన్ని పడేశారు. జూలై 7న చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించగా క్యాబ్‌లో మృతదేహాన్ని తరలించినట్లు గుర్తించారు. అనంతరం క్యాబ్ డ్రైవర్‌ను విచారించగా.. అతడు చెప్పిన వివరాల ప్రకారం హత్య జరిగిన తీరు, ప్రణాళికను చేధించారు. చివరికి సాక్ష్యాలు చూపించగా ముగ్గురూ నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో తల్లీకూతుళ్లు, ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.