సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఉద్యోగుల నెలవారీ జీతాలకు అల్లాడిపోతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక పనులు ముందుకు సాగని పరిస్థితి. కానీ కార్పొరేటర్లకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. పాలక వర్గ పదవీ కాలం ముగియడానికి సరిగ్గా 44 రోజుల ముందు ‘స్టడీ టూర్’ పేరిట విహారయాత్రలకు సిద్ధమవుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కో కార్పొరేటర్‌కు విమాన ప్రయాణం, బస, ఆహారం కోసం సుమారు రూ.90వేల నుంచి లక్ష రూపాయల వరకు వెచ్చించనున్నారు.
అహ్మదాబాద్, చండీగఢ్ వంటి నగరాల్లో ‘పాలన’ ఎలా ఉందో చూడడానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సుమారు రూ.1.40 కోట్ల ఖర్చు చేస్తుండడం, ఏమి ఆశించి టూర్లకు ప్లాన్ చేశారంటూ జనం మండిపడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్పొరేటర్ల విజ్ఞప్తిపై స్పందించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి స్టడీ టూర్‌కు ఆమోదం తెలుపడం.. నేడు జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా? లేదా అన్నది చూడాలి.