సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ): ఒక ప్రాజెక్టు ప్రతిపాదన కార్యరూపంలోకి రావాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో పనుల సాధ్యాసాధ్యాలు, డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఆ తర్వాత నిధులపై స్పష్టత, టెండర్ల ప్రక్రియను ముగించుకుని పనుల శంకుస్థాపన చేయాల్సి ఉంటుంది. కానీ ఘనత వహించిన కాంగ్రెస్ సర్కార్‌లో గుడ్డి దర్బార్లా టెండర్లు పిలవని ప్రాజెక్టుకు పనుల శంకుస్థాపన జరిగింది. కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ప్రీ రవాణా లక్ష్యంగా ప్రభుత్వం చర్యలకు సంకల్పించింది. రూ. 421 కోట్లతో ప్యాకేజీ -1లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం, ముగ్ద జంక్షన్, రూ.405 కోట్లతో ప్యాకేజీ-2లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్ , క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లు సిగ్నల్ ఫ్రీ చేసేందుకుగానూ ప్రభుత్వం పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
హెచ్ సిటీ ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పిన ప్రభుత్వం నెలలు కావొస్తున్నా నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండు క్వార్టర్స్ ముగిసినప్పటికీ జీహెచ్ఎంసీ కేటాయించిన రూ. 3,075 కోట్ల బడ్జెట్లో కేవలం రూ. 250 కోట్లు మంజూరు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం 3446 కోట్ల హెచ్ సిటీ ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయడం విస్మయానికి గురిచేసింది. ఆగమేఘాల మీద ఈ పనులకు శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఎంటీ? నిధుల మంజూరుపై స్పష్టత లేకుండా పనులు ఎ లా చేసేదిఅన్న చర్చ ఇంజినీర్లలో, ఉద్యోగుల్లో నెలకొనడం గమనార్హం.
హెచ్ సిటీ ప్రాజెక్టు పనులపై విస్తృత చర్చ..
కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు (గ్రేడ్ సఫరేటర్స్) అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కేబీఆర్ పార్కు జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నం.45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ పనులకు గానూ రూ.1090 కోట్లు, రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు మల్టీ లెవల్ ఫ్లై ఓవర్, ఖాజాకుంట జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ పనులకు రూ. 837 కోట్లు, అమీన్పూర్ నుంచి ఎన్‌హెచ్ 65 రహదారి విస్తరణకు రూ. 45 కోట్లు, సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు రహదారి విస్తరణకు రూ. 39 కోట్లు, అంజయ్య నగర్ నుంచి రాంకీ టవర్ రోడ్ వరకు రహదారి విస్తరణకు రూ.31 కోట్లు, స్టీల్ గిడ్డర్ బ్రిడ్జి (పైపులైన్) నిర్మాణానికి రూ. 56 కోట్లు, ఆర్కేపురం ఆర్వో రూ. 210, ఆర్కే పురం ఆర్‌యూబీకి రూ.35 కోట్లు, చిలకలగూడ ఆర్యూబీ పనులకు రూ. 30 కోట్లు, ఒవైసీ ఫ్లై ఓవర్ నుంచి సంతోష్‌నగర్ ఫ్లై ఓవర్ ఎడమ వైపు డౌన్ ర్యాంపు, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్ నుంచి కాటేదాన్ జంక్షన్ వరదకు ఆరు లేన్ల బై డైవర్షనల్ గ్రేడ్ సఫరేటర్కు రూ. 200కోట్లు, ఆరాంఘర్ జంక్షన్ ఆర్యుబీ రూ.59 కోట్లు, సోహెబ్ హోటల్ నుంచి బాలాపూర్ రోడ్ వరకు రహదారి విస్తరణకు రూ.9కోట్లు, లక్కీస్టార్ హోటల్ నుంచి హఫీజ్‌బాబా నగర్ వరకు రహదారి విస్తరణ పనులకు రూ. 57 కోట్లతో పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు , రూ.17కోట్ల అంచనాలతో వరదనీటి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
పలు అభివృద్ధి పనులు అందుబాటులోకి..
జలమండలి ఆధ్వర్యంలో రూ.669 కోట్లతో చేపట్టిన ఆరు ఎస్టీపీలను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వీటితో పాటు శివారులో ఓఆర్ఆర్ ఫేజ్ -2 కింద చేపట్టిన రూ.45 కోట్లతో 19 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. హెచ్ఆర్డీసీ ఆధ్వర్యంలో రూ.1500 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను పురసరించుకొని హెచ్ఎండీఏ ఐమాక్స్ గ్రౌండ్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… హైదరాబాద్‌ను న్యూయా ర్, టోక్యో నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. సుమారు రూ.7వేల కోట్లతో భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణకు మణిహారంగా 360 కిలోమీటర్లతో రీజినల్ రింగ్ రోడ్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను గుర్తించి సంపుల నిర్మాణ పనులు చేపట్టామని, ఇప్పుడు రహదారులపై నీరు నిలువకుండా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి, మంత్రులు సందర్శించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురసరించుకొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, వాటర్ వర్స్ ఎండీ అశోక్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.