సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ల పరిధిలోని పలు కీలక ప్రభుత్వ సంస్థల్లో విజిలెన్స్ (నిఘా) విభాగాల పనితీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ, జలమండలి లాంటి ప్రతిష్టాత్మక శాఖల్లో అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన విజిలెన్స్ విభాగాలు పూర్తిగా చేతులెత్తేసాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాఖల్లో అంతర్గతంగా జరిగే అక్రమాలపై ముందస్తు సమాచారం సేకరించి, ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చి అవినీతిని ఆదిలోనే తుంచివేయాల్సిన విజిలెన్స్ విభాగాలు.. ప్రస్తు తం కేవలం ‘పేరుకే’ పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ నిఘా శూన్యం కావడంతోనే.. వరుసగా అవినీతి తిమింగలాలు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఒక డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, పలువురు ఎస్సైలతో పాటు సుమారు 25 మందికి పైగా సిబ్బందితో భారీ విజిలెన్స్ విభాగం కొనసాగుతోంది. ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ.. అవినీతి అధికారులపై అంతర్గత నిఘా పెట్టడంలో ఈ విభాగం ఘోరంగా విఫలమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు, ప్రభుత్వం.. ప్రత్యేకంగా విచారణకు ఆదేశిస్తే తప్ప.. సొంతంగా అవినీతి అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తప్పు చేసే అధికారుల్లో విజిలెన్స్ అంటే భయం లేకుండా పోయింది. కొందరు అధికారులు బహిరంగంగానే లంచాల లావాదేవీలు నడుపుతున్నా నిఘా విభా గం కళ్లుండీ చూడలేని స్థితిలో ఉండిపోవడం గమనార్హం.
ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో..
ట్రై కార్పొరేషన్లలో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగంలోనే అత్యధికంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న భారీ అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్న అనుమతులు, కొందరి చైన్మెన్ల లావాదేవీలపై విజిలెన్స్ నుంచి ఎలాంటి సమగ్ర నివేదికలు కమిషనర్‌కు సమర్పించకపోవడం, బడంగ్‌పేట లాంటి సర్కిల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో విజిలెన్స్ పనితీరు పూర్తిగా విఫలం చెందిందని విమర్శలు ఉన్నాయి.
కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా విజిలెన్స్ విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో.. అసలు ఈ విభాగాలు ఉండి ఉపయోగం ఏంటి? అని పౌరులు ప్రశ్నిస్తున్నారు. అవినీతి అధికారులకు ముందస్తు చెక్ పెట్టాల్సిన విజిలెన్స్ వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్లే ప్రభుత్వ శాఖల పరువు బజారున పడుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. గ్రేటర్ లోని కీలక శాఖల్లోని విజిలెన్స్ విభాగాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, సమర్థవంతమైన అధికారులను నియమించి ఈ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజిలెన్స్ వ్యవస్థ నిర్వీర్యం!
ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ, జలమండలి శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఏసీబీ దాడుల్లో వరుసగా పట్టుబడటం.. ఇకడి విజిలెన్స్ వ్యవస్థల వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోందని ఉద్యోగ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. అవినీతి అధికారులపై సాధారణ ప్రజలే స్వయంగా ఆధారాలు సేకరించి, ఏసీబీని ఆశ్రయించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. కూకట్పల్లి జోన్లో ఎస్ఈ చిన్నారెడ్డిని ఏసీబీకి స్వయంగా బాధిత కాంట్రాక్టర్ పట్టించిన కేసు ఇందుకు అద్దం పడుతున్నది. ఆయా శాఖల్లోనే జీతాలు తీసుకుంటూ తిష్టవేసిన విజిలెన్స్ అధికారులు ముందే సమాచారాన్ని సేకరించి, శాఖాపరమైన చర్యలు తీసుకుని ఉంటే.. అవినీతి వందల కోట్లకు చేరేదా? అన్న చర్చ నడుస్తున్నది.