హయత్‌నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హయత్‌నగర్ ఆర్టీసీ బస్ డిపో రోడ్డును వెడల్పు చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హయత్‌నగర్ బస్ డిపో నుండి శాంతినగర్‌ను కలుపుతూ ఇప్పటికే రహదారి ఉందని, డిపో పక్క నుండి ఉన్న 15 ఫీట్ల రోడ్డును 40 ఫీట్ల వరకు వెడల్పు చేయాలని సూచించారు. దీంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వస్పరినగర్, పోచమ్మ కాలనీ, తిరుమల కాలనీ, రామకృష్ణానగర్, సాయినగర్, ముదిరాజ్ కాలనీ, శాంతినగర్ కాలనీల గుండా ఇంజాపూర్ వరకు రోడ్డును వెడల్పు చేయాలని కోరారు.
చుట్టుపక్కల ఆయా ప్రాంతాల్లోని దాదాపు 15 కాలనీలను హయత్‌నగర్ బస్ డిపో కలుపుతుందన్నారు. బస్ డిపో పరిధిలో ఖాళీ స్థలం ఉన్నదని పేర్కొన్నారు. కాలనీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవకుండా రోడ్డును వస్పరి కాలనీ వరకు పొడిగించి అభివృద్ధి చేయాలన్నారు. జాతీయ రహదారికి అతి తక్కువ దూరంలో కలపడం ద్వారా ఈ మొత్తం మార్గం ప్రయాణీకులకు షార్ట్‌కట్ మార్గంగా ఉపయోగపడుతుందని, దాన్ని గుర్తించి రోడ్డు వేయడానికి అనుమతులు జారీ చేయాలని కోరారు.