సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చిందే ప్రజారవాణా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం శరవేగంగా విస్తరించిన నగర పరిధికి అనుగుణంగా విస్తారమైన రవాణా సదుపాయాల కల్పన అనివార్యమైంది. ఆధునాతన, మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో… బీఆర్ఎస్ ప్రతిపాదించిన లక్డీకాపూల్-బీహెచ్ఈఎల్ మెట్రో మార్గం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటుగా జేబీఎస్-బోయిన్పల్లి, కూకట్పల్లి వై జంక్షన్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెట్రో తదుపరి ప్రణాళికలను చేసింది. కానీ కాంగ్రెస్ రావడంతోనే ఆ ప్రతిపాదనలన్నీ అటకెక్కించినట్లుగా నగరంలో కీలకమైన రవాణా ప్రాజెక్టులు బుట్టదాఖలు అవుతున్నాయి.
ఈ రెండు కీలకమైన మార్గాలను రాబోయే ఫేజ్-2 విస్తరణలో చేర్చాలంటూ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో అత్యంత ముఖ్యభూమికను పోషించే నార్త్ సిటీ మెట్రో సాధన సమితితో కలిసి మరోసారి తెరమీదకు తెచ్చారు. అక్కడితో ఆగిపోకుండా ప్రాజెక్టును విస్తరణ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెస్ట్ హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ మధ్య మెరుగైన రవాణా సదుపాయాలను అనుసంధానం చేస్తూ… బీహెచ్ఈఎల్ నుంచి చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, టోలిచౌకీ, మెహదీపట్నం మీదుగా లక్డీకాపూల్ వరకు భారీ కారిడార్‌ను ప్రతిపాదించారు.
ఈ రూట్ అందుబాటులోకి వస్తే అమీర్‌పేట, రాయదుర్గం మెట్రో స్టేషన్లపై రద్దీ విపరీతంగా తగ్గనుండగా, మరిన్ని కొత్త ప్రాంతాలకు సిటీ విస్తరణ జరగనున్నది. నిత్యం లక్షలాది మంది ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగించే నగరవాసులకు ట్రాఫిక్ పద్మవ్యూహాం నుంచి బయటపడనుండగా, ట్రాఫిక్, కాలుష్య, ఇంధన వినియోగంలో భారీ మార్పులు తీసుకురానుంది. ఎంతో నగర రవాణా వ్యవస్థకు ఇదొక కీలకమైన మలుపు కానుండగా ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. కొన ఊపిరితో జీవచ్ఛవంలా పడి ఉన్న ఈ మార్గాన్ని బతికించాలని డిమాండ్ చేస్తూ నగరవాసులు గళమెత్తుతున్నారు.

Hyderabad Metro Rail
లింకులతో మెరుగైన రవాణా…
బహుళ రవాణా ప్రయోజనాలు ఉన్నా లక్డీకాపూల్-బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్‌ను కలిపే మెట్రో లింక్ ద్వారా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు, అదేవిధంగా పటాన్ చెరు నుంచి కోర్ సిటీకి వచ్చే జనాలకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా నార్త్-వెస్ట్ కనెక్టివిటీ బలోపేతమయ్యే ఈ ప్రాజెక్టుల విషయంలో రెండు ప్రభుత్వాలు ఎందుకు తాత్సారం చేస్తుందని నగరవాసులు మండిపడుతున్నారు.
సంతకాల సేకరణతో..
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నగర ప్రజలు ఇప్పుడు ఒక సామూహిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ వేదికగా డిజిటల్ పిటిషన్ ప్రారంభించిన ఒక్క రోజులోనే వందలాది మంది ధృవీకరిస్తూ సంతకాలు చేస్తున్నారు. ఈ వందలాది మంది నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణతోనే ఈ డిమాండ్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రజా అవసరాలను పాలకులు గుర్తించాలని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి డిమాండ్ చేస్తున్నది. హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ ఈ డిమాండ్‌కు మద్దతు తెలపాలని, ఈ సంతకాల సేకరణ ఉద్యమం కేవలం ఐటీ కారిడార్‌కు పరిమితం కాకుండా, బోయిన్పల్లి, కూకట్పల్లి, చందానగర్తోపాటు నరెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యార్థులు, ఉద్యోగులు మద్దతు పలకాలన్నారు.
ప్రధాన డిమాండ్ ఇదే…
ప్రధానంగా బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ కారిడార్, జేబీఎస్-కూకట్పల్లి జంక్షన్ లింకులను కూడా విస్తరణ ప్రతిపాదనల్లో చేర్చాలని కోరుతున్నారు.. ఆలస్యం చేయకుండా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి మరోసారి పంపి, అనుమతులు పొందాలి. కేవలం నగరవాసుల ఇప్పటి అవసరాల కోసమో, లేదా రాజకీయ ప్రయోజనాల కోసమో ప్రాజెక్టులను చూడకుండా… రాబోయే 50ఏళ్ల పాటు హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అప్పుడే హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవకాశం ఉంటుందనీ నగరవాసులు స్పష్టం చేశారు.