EX MP Vinodkumar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్‌ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని సీఎం అనడం కోడ్ ఉల్లంఘన కాదా..? అని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా మూడు రోజుల గడువే ఉంది. ఎన్నికల కమిషన్ దృష్టికి బీఆర్ఎస్ చాలా అంశాలు తీసుకెళ్లింది. బీఆర్ఎస్ తరపున కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులకు కేసీఆర్ తనతో పాటు సోమా భరత్‌ను నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు మేము కేటీఆర్‌తో కలిసి ఇటీవలే ఢిల్లీ వెళ్లి మా అభిప్రాయాలు చెప్పాం. దురదృష్టవశాత్తు కేంద్ర ఎన్నికల సంఘం పక్ష పాత వైఖరితో పని చేస్తోంది.
గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మా పార్టీ నేతల పై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మా అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిలపై ఏవో వ్యాఖ్యలు చేశారని అప్పట్లో 48 గంటల పాటు వారి ప్రచారం పై నిషేధం విధించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్‌ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని సూటిగా ప్రశ్నిస్తున్నాము. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని సీఎం అనడం కోడ్ ఉల్లంఘన కాదా ? బీఆర్ఎస్కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని అజారుద్దీన్ అనడం కోడ్ ఉల్లంఘన కాదా ? కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం ఎలా చేస్తారో చూస్తా అని బెదిరించడం కోడ్ ఉల్లంఘన కాదా..? ఇక్కడి ఎన్నికల ప్రధానాధికారికి ప్రతిరోజూ మా నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోరా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఆది శ్రీనివాస్ లేఖపై సీఈఓపై చర్యలు తీసుకోరా..?
భాద్యతాయుతమైన పదవిలో ఉన్నవుడు సీఈవో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. సుదర్శన్ రెడ్డి మా ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటివరకు కాంగ్రెస్‌కు కనీసం ఎందుకు నోటీసులు ఇవ్వరు? ఈసీ పక్షపాత వైఖరిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తాం. విప్ ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు భవనానికి రూ. 8 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎలా లేఖ రాస్తారు..? ఆది శ్రీనివాస్ లేఖపై సీఈఓపై చర్యలు తీసుకోరా..? చర్యలు తీసుకుంటే ఆయన పదవి పోవడం ఖాయం. మత కలహాలు రేపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్నిక ముగిసేలోపు ఏవైనా ఘర్షణలు జరిగితే సీఈవోదే భాద్యత. బైండోవర్ చేసిన వారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు చేపట్టడం లేదు. మేము లేవనెత్తిన అంశాలఫై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.
ఢిల్లీలో మా బృందం సీఈసీని కలిసి ఇక్కడి ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ఫిర్యాదు చేసిందని వినోద్ కుమార్ అన్నారు. గతంలో శేషన్ కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్‌గా ఉన్నపుడు ప్రధాన మంత్రి కార్యాలయం పిలిచినా వెళ్లలేదు. ఆయన నిష్పక్షపాతంగా పని చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై కొందరు అధికారులు నీళ్లు చల్లుతున్నారు. మేము భాద్యతాయుతంగా మాట్లాడుతున్నాం.
ఈసీ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్
ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయకపోతే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. గతంలో రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించినా ఈసీ చర్యలు తీసుకోలేదు. ఇపుడు కూడా అదే ధోరణిలో రేవంత్ ఏం మాట్లాడినా ఈసీకి పట్టడం లేదు. తప్పు చేసిన వారిని దేవుడు చెప్పినా ఈసీ వదల కూడదు. కేంద్ర బలగాలను జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో మోహరించాలని ఢిల్లీ లో మా బృందం సీఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పోలీసులు కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్నారు. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించినా చర్యలు తీసుకోవడం లేదా ?.. అసలు ఎన్నికల కమిషన్ ఉందా.. అనే అనుమానం కలుగుతోంది.