నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. మంత్రిమండలి కూర్పులో ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటారు. మరి గ్రేటర్లో బోణీ కొట్టని కాంగ్రెస్.. మంత్రిమండలిలో ఎవరికి అవకాశం ఇస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కౌన్ బనేగా సిటీ మంత్రి ? అనేది ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్నగా మారిపోయింది. ఇదిలా ఉంటే అధికార పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసలు ప్రాతినిధ్యం లేకపోవడమనేది బహుశా ఇదే మొదటిసారి అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రిమండలి… సాధారణంగా ప్రతి జిల్లాకు అందులో బెర్త్ ఉంటుంది. అందులో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌కు అయితే సముచిత ప్రాధాన్యత ఉంటుంది. కానీ నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో… మంత్రివర్గంలో గ్రేటర్ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందా? అనేది రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మెరుగైన సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలోనూ ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా? లేదా గ్రేటర్‌కు స్థానం ఇవ్వకుండానే మంత్రివర్గాన్ని నింపుతారా? అనేది రాజకీయ ఉత్కంఠకు కారణమవుతుంది.
కాగా అధికార పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసలు ప్రాతినిధ్యం లేకపోవడమనేది బహుశా ఇదే మొదటిసారిగా రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్నటివరకు కొలువుదీరిన ప్రతి ప్రభుత్వంలోనూ గ్రేటర్ హైదరాబాద్‌కు కీలక ప్రాధాన్యత ఉంటుందనేది రాజకీయ సత్యం. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీకి కనీసం ఒకటో, రెండు సీట్లతో రాజధాని ప్రాంతంలో ప్రాతినిధ్యం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీలే కావడంతో కచ్చితంగా ఆ రెండు పార్టీలకు ప్రతిసారి కొన్ని స్థానాల్లో ఇక్కడ ప్రాతినిధ్యం దొరికేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి… రెండు స్థానాల్లో విజయం సాధించింది.
2018 ఎన్నికల్లో ఏకంగా పద్నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఈ రెండు సమయాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో పాటు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మరీ మంత్రివర్గంలో స్థానం కల్పించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొదటిసారిగా తాజా ఎన్నికల్లో అధికార పార్టీకి గ్రేటర్ పరిధిలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. చివరకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ సైతం ముషీరాబాద్ నుంచి గెలవలేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇతర ముఖ్య నాయకులు కూడా గ్రేటర్ పరిధిలో గెలవలేదు.
సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆయా అధికార పార్టీల సమీకరణాలు ఉంటాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కనీసం ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురికి ప్రాతినిధ్యం ఉండేలా మంత్రివర్గ కూర్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల ఫలితాల్లో అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి మాత్రం లేదు. దీంతో దీనిని ఎలా భర్తీ చేస్తారనే దానిపై గడిచిన మూడు, నాలుగు రోజులుగా రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది. సాంకేతిక వెసులుబాటు ప్రకారం… ఎమ్మెల్యేగా గెలుపొందని వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే ఆరు నెలల్లో ఏదో ఒక స్థానం నుంచి ప్రాతినిధ్యం సాధించాలి. లేకపోతే శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. గతంలోని సంప్రదాయం ప్రకారం కచ్చితంగా ఎమ్మెల్సీగానే అవకాశం కల్పిస్తారు. అయితే ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠను రేపుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఈ అవకాశం ఇస్తారా? కొత్త పేరును తెరపైకి తెస్తారా? అనేది ఒకటీ, రెండు రోజుల్లో తేలనుంది.