మేడ్చల్, జూలై 13(నమస్తే తెలంగాణ): ప్రత్యేక పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేనా? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరును మండలాల్లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. అభివృద్ధి పనులు, పథకాలను ప్రజలందరికి అందించేలా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చే లక్ష్యంగా జిల్లాలోని 15 మండలాల్లో నియమించిన ప్రత్యేక అధికారులు వారంలో రెండు రోజులు పర్యటించాల్సి ఉంటుంది.
ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను నియమించిన క్రమంలో జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలతో పాటు ప్రత్యేక అధికారుల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారులు మండలాలపై దృష్టి సారించలేరన్న అనుమానలు వ్యక్తమవుతున్నాయి. మండలాల పరిధిలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ప్రత్యేక అధికారులకు సమయం అంత అంత మాత్రంగా ఉంటున్న నేపథ్యంలో ఎలా అమలు జరుగుతున్నదనేది ప్రశ్నార్థకంగా మారనుంది. అంతేకాక మండలాల నుంచి వచ్చే ఫిర్యాదులు అభివృద్ధి పనుల పథకాల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రత్యేక అధికారులు నిర్వహించాల్సిన విధులు
జిల్లాలోని 15 మండలాలకు నియామకమైన ప్రత్యేక అధికారులు మండలాల పరిధిలోని సమస్యలను పరిశీలించి ఎప్పటి కప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రతి మంగళ, శుక్రవారాలలో ప్రత్యేక అధికారులు పర్యటించాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు సంబంధించిన విషయాల నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు సమర్పించాల్సి ఉంటుంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల తీరులో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశాలను ప్రత్యేక అధికారులకు కల్పించారు. అయితే, ప్రత్యేక అధికారులు పాలన ఆరు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎంత వరకు ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతాయన్నది వేచి చూడాల్సిందే.