ఈ వీకెండ్లో హైడ్రా బుల్డోజర్లు ఎటూ వైపు వెళ్తాయి.. ప్రస్తుతం నగరవాసుల్లో నెలకొన్న ఉత్కంఠ ఇది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులు అందగానే.. ఆయా ఏరియాల్లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శనివారం ‘హైడ్రా’ ఎక్కడ ముహూర్తం పెట్టింది..? ఏ అక్రమ కట్టడం నేలకూలనున్నది అనేది చర్చనీయాంశంగా మారింది.
-సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ)/ మియాపూర్/దుండిగల్
HYDRA | గత వారం వరకు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా శని, ఆదివారాల్లో తెల్లవారుజాము నుంచే తమ ఆపరేషన్‌ను ప్రారంభించి గంటల వ్యవధిలోనే ముగించింది. కబ్జాదారులు కోర్టులకు వెళ్లకుండా ఉండేలా పకడ్బందీగా హైడ్రా తమ ప్రణాళికలను అమలు చేస్తూ వెళ్లింది. ఇంతలో ఓల్డ్‌సిటీలో మల్కం చెరువులో ఎంఐఎం నేతలు నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలను కూల్చాలంటూ ఫిర్యాదులు రావడం, సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీయడంతో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో వెనక్కి తగ్గిన హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఆయా ప్రాంతాల్లో కబ్జా చేసి నిర్మించిన కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. ఈ నోటీసుల్లో కొందరికి ఆరు నెలల సమయం, మరికొందరికి నెల రోజులు, ఇంకొందరికి 7 రోజుల సమయం అంటూ ఆయా శాఖలు ఇస్తున్న సమయాన్ని చూసి.. ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కబ్జా చేసిన వాళ్లందరినీ ఒకేలా చూడాల్సిన హైడ్రా..అధికార పార్టీతో పాటు ఆ పార్టీకి అడుగులకు మడుగులొత్తే వారికి మాత్రం ఒక రకంగా, ఇతరులను మరో రకంగా చూస్తూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదంటూ..
ఆరోపిస్తున్నారు. హైడ్రా ఇస్తున్న నోటీసులతో కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటారనే ఉద్దేశ్యంతోనే శని, ఆది వారాలతో పాటు సెలవు దినాల్లోనే హైడ్రా కూల్చివేతలు నిర్వహిస్తూ వస్తున్నది. ఈ శని, ఆదివారాల్లో హైడ్రా బుల్డోజర్లను ఎక్కడ దింపుతుందనేదానిపై నగర వాసులు ఎదురు చూస్తున్నారు.
సామాన్యులను భయపెట్టిస్తున్న హైడ్రా..
ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తామంటూ హైడ్రా నెల రోజులుగా హంగామా చేస్తూ 18 నిర్మాణాలను కూల్చి 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. హైడ్రా చేస్తున్న హైడ్రామాలతో నాలాలు, చెరువుల సమీపంలో కొన్నేళ్లుగా నివాసాలుంటున్న సామాన్య ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
సర్వే నంబర్ ఒకటేసి, పొజిషన్ మరో ప్రాంతంలో ఉండి కొందరు అనుమతులు పొంది భవనాలు నిర్మించారు. అలాంటి వాటికి రుణాలు సైతం బ్యాంకులు ఇచ్చాయి.. రిజిస్ట్రేషన్లూ అయ్యాయి. అన్ని సక్రమంగానే ఉన్నాయని లీగల్ ఓపినియన్ సైతం తీసుకొని చాలా మంది ఫ్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన వారున్నారు. అలాంటి వారు ఇప్పుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు బుల్డోజర్లు ఇండ్లపైకి వస్తాయా? అని భయపడుతున్నారు.
హైడ్రా పేరు చెప్పుకుంటూ..
హైడ్రా పేరు చెప్పుకుంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు అధికారులు నోటీసుల పేరుతో వ్యాపారులు, సామాన్య ప్రజలు భయాందోళనకు గురిచేస్తున్నారు. ‘నోటీసులు ఇచ్చాం.. ఇక కూల్చేస్తాం’అంటూ బెదిరిస్తున్నారు. ఏదో ఒకటి చేసి ఆపండంటూ ఆఫర్లు వస్తుండడంతో ఆయా అధికారులు బేరాలకు దిగుతున్నారు.
సీఎం సోదరుడి ఇంటి వద్ద హైడ్రామా..
దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో అమర్ సొసైటీ ఉందంటూ.. అక్కడ 200కుపైగా ఇండ్లకు ఇరిగేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను నోటీసులపై స్పందించాలని కోరింది. అయితే ఆయన అనుచరులు మీడియాపై దాడికి ప్రయత్నించారు. కొందరు మీడియా ప్రతినిధుల చేతిలో నుంచి లోగోలు లాక్కొనేందుకు యత్నించారు.
ఐటీ అడ్డాలో ‘హైడ్రా’ గుబులు
చెరువులు, కుంటలు, పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా బుల్డోజర్లతో దూసుకుపోతున్నది. ప్రధానంగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండటంతో ఐటీ అడ్డా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అక్రమ నిర్మాణదారులకు చెమటలు పడుతున్నాయి. నియోజకవర్గంలోనే అతి పెద్దదైన దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో భారీ భవనాలు నిర్మాణాలు జరగ్గా…వాటికి ఈ నెల రెండో వారంలో అధికారులు నోటీసులు జారీ చేశారు.
సీఎం సోదరుడు సహా సినీ రాజకీయ ప్రముఖుల నివాసాలతో పాటు వ్యాపార వేత్తలవే వాటిల్లో సింహభాగం ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని వాటిపైనా త్వరలోనే చర్యలుంటాయన్న ఊహాగానాలు నెలకొన్నాయి. దుర్గం చెరువుతో పాటు గంగారం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనూ పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను గుర్తించి..నోటీసులు జారీ చేశారు. వీటిని సైతం త్వరలో నేలమట్టం చేయనున్నారు.
సర్కారు స్థలాల పరిరక్షణకు.. ల్యాండ్ బ్యాంక్
నగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలపై జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఆక్రమణకు గురైన భూమి ఎంత? కోర్టు కేసుల్లో ఎంత స్థలం వివాదంలో ఉంది? తదితర వివరాలను మండలాల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మార్వోలకు హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి.. వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. అంతేకాదు మండలాల వారీగా భూ లెక్కలను పరిశీలించేందుకు డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్‌లో 16 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 1075 ల్యాండ్ పార్సిల్స్ ఉన్నట్లు గత రెవెన్యూ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 890 ల్యాండ్ పార్సిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణ స్థలం ఖాళీగా ఉంది. మిగతా పార్సిల్స్‌లో సుమారు 11, 45,334.95 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఆక్రమణలో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. సుమారు 169 పార్సిల్స్‌లో 445098.64 చదరపు గజాల ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కోర్టుల్లో ఏండ్ల తరబడి వివాదాస్పదంగా ఉన్న భూములను త్వరితగతిన కొలిక్కి తీసుకొచ్చేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా లా ఆఫీసర్స్‌తో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నిజాంపేట్ కమిషనర్ బదిలీ
నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు బదిలీ అయ్యారు. ఆయనను నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా సర్కారు బదిలీ చేసింది. ఇటీవల హైడ్రా బాచుపల్లి మండలం ఎర్రకుంట చెరువులో నిర్మించిన మూడు అపార్ట్మెంట్లను కూల్చివేసింది. అయితే చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. చూసీచూడనట్లు వదిలివేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కమిషనర్‌తో పాటు బాచుపల్లి తహసీల్దార్ పూల్సింగ్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారావు బదిలీకావడం చర్చనీయాంశమైంది. రామకృష్ణారావు స్థానంలో యూజీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎంపీడీవో ర్యాంకు అధికారి సౌజన్యను ప్రభుత్వం కమిషనర్‌గా నియమించింది.