సిటీ బ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేందుకు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు కలెక్టరేట్‌కు రాలేని వారు తమ అర్జీలను వాట్సాప్ నంబర్ 7416687878కు వాట్సాప్ చేయవచ్చని చెప్పారు.
ఈ వెసులుబాటు ద్వారా సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు, దినసరి కూలీలు తమ విధులకు ఆటంకం కలుగకుండా ఇంటి నుంచే దరఖాస్తులను పంపవచ్చని చెప్పారు. అర్జీదారులు వ్యయ ప్రయాసల కోర్చి కలెక్టరేట్‌కు రాకుండా వాట్సాప్ ద్వారా పంపిస్తే తమ సిబ్బంది వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకుని ఒక ఐడీ నంబర్ కేటాయించి అర్జీ అందినట్లు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.