బంజారాహిల్స్, మే 6: అర్జెంట్‌గా డబ్బులు పంపించమని ఆస్పత్రి ఎండీ పేరుతో వచ్చిన మెసేజ్‌ను చూసిన డ్యూటీ డాక్టర్ సైబర్ మోసానికి గురయ్యారు. శ్రీనగర్ కాలనీలోని తన్వీర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డా.సువర్ణకు ఈనెల 4న ఆస్పత్రి ఎండీ డా.నౌనిహాల్ సింగ్ డీపీతో ఉన్న వాట్సాప్ నుంచి ‘నేను బయట ఉన్నాను. ఈ నెంబర్‌కు రూ.45వేలు పంపించండి..’ అంటూ మెసేజ్ వచ్చింది. దీంతో డా.సువర్ణ డబ్బు పంపిన తర్వాత ఆస్ప త్రి ఎండీని సంప్రదించగా తాను మెసేజ్ పంపలేదని చెప్పారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.
సింగపూర్‌లో ఉద్యోగం అంటూ బురిడీ కొట్టించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం.5 దేవరకొండబస్తీలోని రాయల్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ప్రయాష్ దాస్ తమంగ్(25) అనే యువకుడు ఆన్లైన్లో ఉద్యోగం కోసం చూస్తుండగా సింగపూర్‌లో ప్రముఖ హోటల్లో ఉద్యోగం అంటూ ప్రకటన కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగా వరల్డ్ టూర్ అండ్ ట్రావెల్స్, న్యూఢిల్లీ సంస్థ ప్రతినిధిని అంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. సింగపూర్‌లో ఉద్యోగమని రూ.38,800 తీసుకున్నారు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.