GHMC | సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ అధికారుల వైఫల్యం మరోమారు తేటతెల్లమైంది. ఇప్పటికే న్యాయస్థానం మొట్టికాయ వేసినా చలనం లేకుండా వ్యవహరిస్తున్న అధికారులపై తాజాగా గురువారం మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సభ్యులంతా అధికారులపై పనితీరుపై మండిపడ్డారు. చెరువుల్లోకి మురుగునీరు రావడంలేదని ఎలా అంటారని, క్షేత్రస్థాయిలో సమస్య ఉంటే తప్పుడు నివేదికతో అంతా బాగున్నట్లు చూపించడం ఏ మాత్రం సరి కాదని సంబంధిత సీఈపై మేయర్, సభ్యులు మండిపడ్డారు.
13 చెరువులతో అదనంగా చెరువులను చేర్చి వచ్చే స్టాండింగ్ కమిటీ ముందుకు సమగ్ర వివరాలతో రావాలని సూచించింది. దీంతో రెండవ సారి చెరువుల పరిరక్షణపై ముందడుగు పడలేదు. వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు మురికి కూపంగా మారడం, కబ్జాలతో ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఏకంగా ‘గమన’ స్వచ్ఛంద సంస్థ తరఫున దయాకర్ పిటిషనర్ వేయగా, దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన న్యాయస్థానం జీహెచ్ఎంసీకి మొట్టికాయ వేస్తూనే 13 చెరువుల దయనీయస్థితిపై హైకోర్టు ఇద్దరు కోర్టు కమిషనర్ల కమిటీని నియమించి విచారణ జరిపించింది.
న్యాయవాదులు ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి సభ్యులుగా నియమితులైన ఈ కమిటీ.. హస్మత్‌పేట బోయినిచెరువు, చందానగర్ గంగారం చెరువు, దుండిగల్ చిన్నదామెర చెరువు, మద్దెలకుంట చెరువు బైరామల్‌గూడ, నల్లగండ్ల చెరువు, పెద్ద చెరువు పీర్జాదిగూడ, అంబీర్ చెరువు కూకట్పల్లి, చిన్నరాయుని చెరువు అల్వాల్, దుర్గంచెరువు, ఉప్పల్ నల్లచెరువు, సున్నంచెరువులు పరిరక్షణకు దూరంగా ఉన్నాయని నిగ్గు తేల్చింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా 13 చెరువుల పరిరక్షణలో.. టెక్నికల్ కన్సల్టెంట్‌గా నీరి (జాతీయ పర్యావరణ, ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ)ని నియమించుకుని చెరువుల నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షలు జరపడంతోపాటు ఇరిగేషన్ సమన్వయంతో సంబంధిత చెరువుల ఆక్రమణకు గురి కాకుండా పక్కాగా పరిరక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు రూ.55లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐతే స్టాండింగ్ కమిటీ సమావేశంలో అనుమతి తీసుకునేందుకు ఎజెండా అంశంగా పెట్టారు.
చర్చ సందర్భంలో సంబంధిత ఎస్ఈ కోటేశ్వర రావు 13 చెరువులు పరిశుభ్రంగా ఉన్నాయని, సమీప ప్రాంతాల నుంచి సీవరేజీ(మురుగునీరు) రావడంలేదని చెప్పడంతో సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభ్యులు ఈ ఎజెండాను మరోసారికి వాయిదా వేశారు. దీంతోపాటు ఎల్ఈడీ బోర్డు ప్రతిపాదనను తిరస్కరించారు. స్పోర్ట్స్ గ్రౌండ్లను అద్దెకు ఇచ్చే విషయంలో జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలని, ప్రతిదీ స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చాకనే టెండర్లు పిలిచి అప్పగించాలని మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వాడివేడిగా సమావేశం
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం రెండవ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో వాడివేడిగా జరిగింది. జీహెచ్ఎంసీలో వివిధ రహదారుల విస్తరణకు కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ సమావేశంలో 9 అంశాలు, రెండు టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు. స్టాండింగ్ కమిటీ పాలసీ నిర్ణయాల కమిటీ అని, జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని మేయర్ పేర్కొన్నారు.
అడిషనల్, జోనల్ కమిషనర్లు ఆయా విభాగాలకు సంబంధించిన టెండర్లు తదితర నిర్ణయాలన్నింటిని స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహ్మద్ సలీం, బాతా జబీన్, మహాలక్ష్మి రామన్ గౌడ్, మహ్మద్ గౌస్ ఉద్దీన్, సీఎన్ రెడ్డి, ఎండీ బాబాఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్ప,అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాల్, పంకజ, గీతా రాధిక, రఘు ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు, సుభద్రదేవి, అలివేలు మంగతాయారు, నళిని పద్మావతి, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, హేమంత్ బోరడే, రవికిరణ్, వెంకన్న, సీసీపీ శ్రీనివాస్, సీఈలు రత్నాకర్, భాసర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదించినవి