సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ) : నగరంలో చెరువుల సర్వే, పరిరక్షణ, ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలేవి పట్టాలెక్కడం లేదు. చెరువుల నీటి మట్టం, పూడిక తీవ్రత వంటి అంశాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుకు హెచ్ఎండీఏ గతంలో సోనార్ సర్వేకు ప్రతిపాదించింది. గతేడాది ఆగస్టు నెలలోనే ఈ ప్రక్రియ కూడా మొదలుపెడతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు పడలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సర్వే తోడ్పడుతుందని చెప్పి ప్రణాళికలు చేశారు.
కానీ కార్యరూపంలోకి రాకుండానే అధికారులు చేతులెత్తివేశారు. చెరువుల్లో పేరుకుపోయిన పూడిక, నీటి మట్టం, ప్రస్తుతం ఉన్న లోతును పక్కాగా అంచనా వేసేందుకు బాతిమెట్రిక్ సర్వే కోసం గతంలో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు స్వీకరించింది. కానీ ఇప్పటివరకు ఆ అంశం వైపు దృష్టి సారించలేదు. 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి అయితే పెరిగింది. కానీ చెరవులు ఆధునీకరణ, హద్దుల నిర్ధారణ, బఫర్ జోన్ గుర్తింపు అంశాలను సర్కారు పట్టించుకోవడం లేదు. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికీ చెరువుల గుర్తింపు కొనసాగుతుండగా, ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందనీ అధికారులు చెప్పలేకపోతున్నారు.
11 జిల్లాలకు విస్తరించిన తర్వాత యాదాద్రి, ఫ్యూచర్ సిటీతోపాటు విస్తరించి ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రాంతాలకు వర్తించేలా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్ కోసం ప్రధానమైన చెరువులు, కుంటలు, వాస్తవ స్థితిగతులను అంచనా వేయడానికి సర్వే ద్వారా సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీవరకు హద్దుల నిర్ధారణలో జాప్యం చేస్తుండగా, ఇక చెరువుల నీటిమట్టం తేల్చడాన్ని కూడా సాగదీస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్క పని కూడా మొదలు కాలేదు. కనీసం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాల్సిన చెరువులను గుర్తించనీ హెచ్ఎండీఏ ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టును మొదలుపెడుతుందనే ప్రశ్నార్థకంగా మార్చింది.