NIMS | ఖైరతాబాద్, మార్చి 18 : నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది జీవితాలకు భద్రత కరువైంది. నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులతో పాటు డైరెక్టర్ మొదలు వార్డు బాయ్‌ల వరకు అందరికీ రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డుల పరిస్థితి దయనీయంగా మారింది. 24/7 గంటలు ఆస్పత్రి భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ గార్డులను మాత్రం పట్టించుకునే వారే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్స్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుల వేతనాల వెతలు కొత్తవి కాదు. ఏజెన్సీలు ఎన్ని మారినా రెండు నెలలకు, మూడు నెలలకోసారి వేతనాలు అందించడం పరిపాటిగా మారిపోయింది. గతంలో ఓ ఏజెన్సీ నిమ్స్ సెక్యూరిటీ గార్డులకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయల పీఎఫ్ డబ్బులను దిగమింగింది.
కానీ ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి విచారణకు ఆదేశించకపోగా, మళ్లీ అలాంటి సంస్థలకే బాధ్యతలు ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ని ఏజెన్సీలు మారినా.. వేతనాలు సరిగా చెల్లించకుండా మోసగించే ఏజెన్సీలకే పదే పదే బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు సెక్యూరిటీ గార్డులు వాపోతున్నారు. ప్రస్తుతం కార్తికేయ, ఓపీడీఎస్‌ఎస్ (ఓం సాయి ప్రొఫెషనల్ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థలు నిమ్స్ సెక్యూరిటీ బాధ్యతలను చూసుకుంటున్నాయి. కాగా, మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేస్తూ సెక్యూరిటీ గార్డుల విధుల బహిష్కరణ, నిరసనకు కారణమైన సంస్థ మాత్రం గతంలో సుమారు మూడు కోట్ల పీఎఫ్ డబ్బుల గోల్‌మాల్‌కు పాల్పడిందన్న ఆరోపణలు బహిరంగానే వినిపిస్తున్నాయి. ఆ సంస్థకు ఈ విషయంపై కార్మిక శాఖ నుంచి నోటీసులు సైతం అందినట్లు సమాచారం. మంగళవారం మరో సారి విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
ఏజెన్సీలే ఆలస్యం చేస్తున్నాయి.. -డాక్టర్ బీరప్ప, డైరెక్టర్ నిమ్స్ హాస్పిటల్
నిమ్స్ సెక్యూరిటీ గార్డుల సమస్య మా దృష్టికి వచ్చింది. ఏజెన్సీ గురించి కూడా పూర్తి సమాచారం ఉంది. కాంట్రాక్ట్ ఏజెన్సీ సకాలంలో బిల్లులు పెట్టడం లేదు. గతంలోనూ ఆలస్యం చేయడం వల్లే వారి వేతనాల చెల్లింపులో ఆలస్యమైంది. నిమ్స్ ఆస్పత్రి తరపున ఎలాంటి సమస్య లేదు. ఏజెన్సీ వారే పీఎఫ్ లెక్కలతో కూడిన బిల్లులు అందించకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతున్నది. వారి వేతనాలు సకాలంలో చెల్లించేలా చొరవ తీసుకుంటాం.
వేతనం కావాలంటే రోడ్డెక్కాల్సిందేనా: హరీశ్ రావు
ఖైరతాబాద్, మార్చి 18 : నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వేతనాల కోసం నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం ఆసుపత్రిలో విధులు బహిష్కరించి నిరసన తెలుపడం పై ఆయన ఎక్స్ వేదిక గా స్పందించారు. ఎంతో అంకిత భావంతో ఆస్పత్రికి రాత్రింభవళ్లు సేవలు అందిస్తున్న సిబ్బంది ప్రతి నెల జీతాలు కోసం చేతులు జోడించి అడగాల్సి వస్తున్నదన్నారు. రోడ్డెక్కి పోరాటం చేస్తేతప్ప వేతనాలు చెల్లించడం లేదన్నారు. ప్రతినెల మా జీతం మాకు ఇవ్వండి అని ఉద్యోగులు రోడ్డెక్కి మొరపెట్టుకోవాల్సి రావడం శోచనీయమన్నారు. నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.