సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నది. ఐటీ తదితర రంగాల్లో మహా నగరం దూసుకెళ్తోంది. మరోవైపు నగరానికి భారీ పెట్టుబడులు వస్తుండటంతో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతున్నది. ఇదిలా ఉండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు సంతోషంతో ముందుకు సాగుతున్నారు. తాము పొందిన యూనిట్లతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నారు. వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలకు స్కీమ్స్ ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను సమ దృష్టితో చూస్తున్నదని, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు చెబుతున్నారు.
గ్రేటర్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేగంగా లబ్ధిదారులకు చేరుతున్నవి. ఉదాహరణకు దళిత బంధు అమలు తీరు తీసుకుంటే మొదటి విడుతలో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసిన 1484 మంది లబ్ధిదారులకు దాదాపు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ప్రభుత్వం 15 నియోజకవర్గాల్లో విజయవంతంగా అమలు చేసింది.
దళిత బంధు వచ్చిందని చెప్పగానే ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడింది. మారేడ్‌పల్లిలో నివాసముంటూ.. గతంలో 20 వేల వేతనంతో జీవనం సాగించేవాడ్ని. దళితబంధు పథకంతో టెంట్‌హౌజ్ పెట్టుకున్నా. ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తూ ఇద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఈ పథకం మా కుటుంబంలో ఆత్మైస్థెర్యం నింపింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– శిరీశ్ కుమార్, దళితబంధు లబ్ధిదారుడు
మాది నిరుపేద కుటుంబం. నేను ఓ బట్టల దుకాణంలో పనిచేసేవాడిని. పని ఉంటేనే మా కుటుంబం గడిచేది. దళితులకు న్యాయం చేయాలన్న మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న నాకు ఆ పథకం కింద పది లక్షలు మంజూరయ్యాయి. ఆ పైసలతో మేము నివసించే ప్రాంతంలోనే బట్టల దుకాణం పెట్టుకున్నా. అది మా కుటుంబానికి ఆసరా అవుతున్నది. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం. సంతోషంగా ఉంది. మా కుటుంబానికి సీఎం కేసీఆర్ చేసిన మేలు మరువలేను. మా కుటుంబం ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
– బీఎస్ నర్సింహా రావు, దళితబంధు లబ్ధిదారుడు, బొల్లారం, కంటోన్మెంట్
దళిత బంధు పథంకలో భాగంగా కారును కొనుగోలు చేశా. అంతకు ముందు 15వేలకు డ్రైవర్‌గా పనిచేసేవాడిని. ప్రస్తుతం కారుకు ఓనర్‌ను అయ్యాను. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం పుణ్యమే. మా కుటుంబానికి ఉపాధి చూపిండ్రు. మా జీవితాల్లో వెలుగులు నింపిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– లోకేశ్, దళిత బంధు లబ్ధిదారుడు