Weather Report | హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల తేలికపాటి వర్షంతో పాటు వడగళ్లు కురిశాయి. నాంపల్లి, హైకోర్టు ప్రాంతాల్లో వడగళ్ల వానపడింది. చంచల్‌గూడ, సైదాబాద్, చంపాపేట, గోషామహల్, బేగంబజార్, బహదూర్‌పురా, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టి, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్‌బజార్‌తో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. సాయంత్రం వరకు ఎండ దంచికొట్టగా.. కొద్దిసేపట్లోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
నగరాన్ని మేఘాలు కమ్మేయడంతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎండ వేడితో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వేడి ఉపశమనం పొందారు. మరో వైపు రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.