మలక్‌పేట, నవంబర్ 20 : కుల, మత, వర్గ తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ, రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలోని అన్ని క్రైస్తవ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయని లక్ష్మీనగర్ క్రిష్టియన్ లైఫ్ సెంటర్ చర్చి సంఘ కాపరి, తెలంగాణ ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ ప్రభుచరణ్, బిషప్ దయానంద్ అన్నారు.
సోమవారం మూసారాంబాగ్ డివిజన్ లక్ష్మీనగర్‌లోని క్రిష్టియన్ లైఫ్ సెంటర్ చర్చ్‌లో చర్చి సంఘ కాపరి, పాస్టర్ ప్రభుచరణ్ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల చర్చీల పాస్టర్లు, బిషఫ్లు, క్రైస్తవ సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ మలక్‌పేట నియోజకవర్గ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రభుచరణ్, బిషఫ్ దయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైస్తవ సమాజానికి ఎంతో అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని క్రైస్తవులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించి హ్యాట్రిక్‌ను అందించాలని, రాష్ట్రాన్ని మరో ఐదేళ్లపాటు పాలించేందుకు అవకాశం కల్పించాలని క్రైస్తవ సమాజం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎల్‌బినగర్‌లో క్రైస్తవుల కోసం బరియల్ గ్రౌండ్ సౌకర్యం కల్పించటం పట్ల పాస్టర్లు, బిషప్‌లు, క్రైస్తవ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మలక్‌పేట నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్న తీగల అజిత్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని, అజిత్‌రెడ్డి గెలుపునకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.
క్రైస్తవులంతా తమ అమూల్యమైన ఓట్లను అజిత్‌రెడ్డికి వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, అజిత్రెడ్డిల గెలుపుకోసం పాస్టర్లు, బిషఫ్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ ముల్కల భాస్కర్, రెవరెండ్ ఏసురత్నం, రెవరెండ్ ఆనంద్, యువరాజ్, శ్రీధర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.