సుల్తాన్ బజార్, ఫిబ్రవరి 12: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడిని అడ్డం పెట్టుకొని ధర్మంపై దాడి చేస్తే ఊరుకునేదిలేదని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. బుధవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్లి చిలుకూరులో రంగరాజన్‌ను పరామర్శించారు. ఆయనకు విశ్వహిందూ పరిషత్ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ధర్మం ముసుగులో కొంత మంది హిందుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిని యావత్ హిందూ సమాజం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్, డాక్టర్ సునీత రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకట్‌రెడ్డి, ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి పద్మశ్రీ, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి వాణి సక్కుబాయి, డాక్టర్ ప్రేమలత, అనంతగిరి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రంగనాథ్, నాయకులు నందకిశోర్, మధుసూదన్ రెడ్డి, హరినాథ్, రంగరాజన్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.