సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 ( నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమియే ఎజెండాగా పనిచేస్తాం.. మా ఆత్మహత్యలు కనిపించడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి నీ వైఖరి మార్చుకో’ అంటూ నినదిస్తూ.. ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆటో బంద్ విజయవంతమైంది. అందులో భాగంగా నగరంలో బీఆర్టీయూ , ఏఐటీయూసీ, టీఏటీయూ, సీఐటీయూ, ఏఐటీసీ తదితర సంఘాలతో కూడిన ట్రాన్స్పోర్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. తమను అన్ని విధాలా మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘ఆటో డ్రైవర్లను ఆదుకోండి’ అంటూ ప్ల కార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఒక్కసారిగా ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉచిత బస్సు స్కీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికిపైగా డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఏఐటీయూసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. అటు కేంద్రం హిట్ అండ్ రన్ చట్టంతో డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని, కేంద్రం నల్ల చట్టాలతో రవాణా రంగ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, టీఏటీయూ ఆటో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పోలే నిరంజన్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, హైమద్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, సాయికుమార్ పాల్గొన్నారు.