‘మీకొచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావడం లేదా? మీలో మీరే కుమిలిపోతూ ఆందోళన చెందుతున్నారా? ఎవరితోనైనా పంచుకుంటే చులకనగా చూస్తారని భావిస్తున్నారా? ఇక ఆ భయం మీకు అక్కర్లేదు. సమస్య ఏదైనా సావధానంగా విని.. పరిష్కరించేందుకు షీ టీమ్ సిద్ధంగా ఉంది.
తమపై జరిగే వేధింపులను ఎవరికి చెప్పుకోవాలో బాధితులకు తెలియదు. ఇంట్లో తెలిస్తే అమ్మానాన్నలు, స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులు ఎమనుకుంటారోనన్న భయం వెంటాడుతుంది. ఇక బాధితుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని వేధింపులకు దిగే వారు రెచ్చిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో బాధితులు చేసిన తప్పులతో జరగాల్సిన నష్టం జరిగినా.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం లేక కుమిలిపోతుంటారు. వీటన్నింటికి షీ టీమ్స్ చక్కటి పరిష్కారం చూపుతున్నది. మనోధైర్యం నింపుతూ బాధితుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది.
ఒక్క ఫోన్‌తో సమస్యకు చెక్..
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మొదటగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తన సేవలను విస్తృతం చేసింది. బాధితులకు 24 గంటలు సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే హైదరాబాద్ షీ టీమ్ తన పనితీరుతో మొదటి స్థానంలో నిలిచింది. డయల్ 100, వాట్సాప్ నంబర్ 9490616555,
hydsheteam@gmail.comకు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే రంగంలోకి దిగి పని కానిచేస్తుంది.
కౌన్సెలింగ్‌తో మార్పు..
ప్రతి సంవత్సరం 1400 నుంచి 1500 మంది బాధితులు షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. గత సంవత్సరం 1400 దరఖాస్తులు రాగా వాటిలో చాలా వరకు కౌన్సెలింగ్ ద్వారానే పరిష్కరించారు. సమస్య ఎంత పెద్దైద్దెనా పరిష్కరించడమే లక్ష్యంగా షీ టీమ్స్ పని చేస్తాయంటే అతిశయోక్తి కాదు.
అవగాహన కార్యక్రమాలు
‘మీ కోసం షీ టీమ్స్’ పనిచేస్తున్నాయంటూ షీ బృందాలు నగరంలోని ప్రతిమూలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, పార్కులు, బస్టాప్‌లు ఇలా అనేక రద్దీ ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘భయం వద్దు.. షీ టీమ్స్‌కు ఫోన్ చేయండి, మీ కోసమే మేమున్నామంటూ’ పోలీసు అధికారులు భరోసా కల్పిస్తున్నారు.
కొన్ని ఘటనలు..
అత్యున్నత ఉద్యోగం సాధనే లక్ష్యంగా చదువుతున్న ఓ యువతి అనుకోకుండా ఓ రోజు డేటింగ్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంది. అనంతరం ఓ గుర్తు తెలియని వ్యక్తితో చాటింగ్ చేసింది. తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరగగా.. తరచుగా మాట్లాడుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ యువతి అతడితో స్నేహం కట్ చేసినా ఆ యువకుడు వదల లేదు. మెసేజ్‌లు చేస్తూ.. బ్లాక్ మెయిల్‌కు దిగాడు. దీంతో ఆ యువతి షీటీమ్‌ను సంప్రదించి ఆ యువకుడికి తగిన బుద్ధి చెప్పించింది.
సీరియల్స్‌లో నటించే ఓ యువతిని 56 ఏండ్ల వ్యక్తి వేధించడం మొదలు పెట్టాడు. ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకొని శారీరకంగా, మానసికంగా హింసిస్తుండటంతో మానసికంగా కుంగిపోయింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా ఈ విషయం షీ టీమ్స్‌కు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని పిలిపించి బుద్ధి చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యువతి జోలికి వెళ్లలేదు.
వైద్య విద్య అభ్యసిస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు కలిసి తిరిగిన తర్వాత ఆ యువకుడు మరో వివాహానికి సిద్ధమై నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. దీంతో ప్రేమించిన యువతి కుంగిపోయి ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోగా వారి షీ టీమ్స్‌ను ఆశ్రయించమని చెప్పారు. వెంటనే వారు చెప్పినట్టు చేయగా షీ టీమ్ రంగంలోకి దిగింది. యువతి తల్లిదండ్రులు, యువకుడి కుటుంబ సభ్యులతో పాటు నిశ్చితార్థం జరిగిన యువతితో మాట్లాడింది. అందరిని ఒప్పించి చివరికి ప్రేమికులిద్దరిని కలిపింది. మొదటి పెండ్లి పత్రికను షీ టీమ్‌కు ఇచ్చిన యువతి.. తాళి కట్టిన ఫొటోలను సైతం షేర్ చేసిన ఆనందాన్ని పంచుకుంది.
15 ఏండ్ల వయసులో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. అమ్మాయికి 23 ఏండ్లు రాగా కుటుంబ సభ్యులు పెండ్లి నిశ్చయం చేశారు. ఆ సమయంలో పాత ప్రేమికుడు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. నా దగ్గర మన ఇద్దరి ఫొటోలు ఉన్నాయని.. వాటిని కాబోయే నీ భర్తకు పంపుతానంటూ వేధింపులకు దిగాడు. యువతి ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో అమ్మాయికి కాబోయే భర్తకు పంపగా వారు పెండ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో షీ టీమ్ రంగంలోకి దిగి బ్లాక్ మెయిలర్‌ను పట్టుకుంది. ఆ ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ అని తేల్చి నిశ్చితార్థం జరిగిన యువకుడితో పెండ్లికి ఒప్పించి కథ సుఖాంతం చేశారు.
అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుంటాం..
షీ టీమ్స్‌కు వచ్చే ఫిర్యాదుల్లో అనేక సున్నితమైన అంశాలుంటాయి. అన్ని కోణాల్లో వాటిని పరిగణలోకి తీసుకొని పరిష్కారానికి ప్రయత్నిస్తాం. వేధింపులను భరించలేక ఎవరైనా షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. సమస్య ఏదైనా ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. మీ కోసమే మేమున్నాం. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అందులో వాస్తవం ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం.
-శిరీష, షీ టీమ్స్ అదనపు డీసీపీ