సిటీబ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని వేలం వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాడతామని జేఏసీ ప్రకటించింది. ఈమేరకు శనివారం యూనివర్సిటీ క్యాంపస్లో జేఏసీ సమావేశమై భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై చర్చించారు. హెచ్సీయూ భూములను విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని తీర్మానించారు. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం యూనివర్సిటీలోకి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం హెచ్సీయూ భూములను అమ్మకానికి పెట్టి పర్యావరణాన్ని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. యూనివర్సిటీ భవిష్యత్, పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యార్థులు, ఉద్యోగులు కలిసికట్టుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. భూముల అమ్మకం నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిపై జేఏసీ ప్రతినిధులు మండిపడ్డారు.
భూములు కోల్పోతే అంధకారమే..
ఉన్నతమైన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, పరిశోధనలతో దక్షిణ భారతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని జేఏసీ ప్రతినిధులు అన్నారు. భవిష్యత్లో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు వందల ఎకరాల భూమి అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అక్రమంగా భూములను అమ్మితే యూనివర్సిటీ భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు.