బాలానగర్, జనవరి 2 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కనిపించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే టీకా ప్రక్రియను చేపట్టి నిరంతరాయంగా కొనసాగిస్తున్నది. తాజాగా 15-18 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. ఈ నెల 3వ (సోమవారం)తేదీ నుంచి 15-18 ఏండ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఆరోగ్యశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్‌నేషన్ కేంద్రాలతోపాటు కళాశాలలు, సంచార వ్యాక్సినేషన్ ద్వారా కూడా వ్యాక్సిన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్, కూకట్పల్లి మండలాల పరిధిలో 16 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేస్తున్నాయి. బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కూకట్పల్లి, మూసాపేట, పర్వత్‌నగర్, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ కళాశాలలు, సంచార వ్యాక్సిన్ బృందాలు పనిచేస్తున్నాయి. ఆయా మండలాల పరిధిలో 15-18 ఏండ్ల పిల్లలకు కరోనా వైరస్ ప్రబలకుండా ఉండడం కోసం ప్రభుత్వం యత్నిస్తున్నది. రెండు మండలాల పరిధిలో సుమారు లక్ష మందికి పైగానే పిల్లలున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
సమర్ధవంతంగా పూర్తి చేస్తాం ..
15-18 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నతాధికారుల సూచనల మేరకు పని చేస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడున్న సెంటర్లు కాకుండా అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వారి వారి ప్రాంతాలలోనే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఆందోళన చెందరాదు. వ్యాక్సిన్ తీసుకోవడానికి కొవిన్ పోర్టల్‌లో ముందుగానైనా రిజిస్టర్ చేసుకోవచ్చు..లేదా ఆయా సెంటర్లలో అప్పటికప్పుడే రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవచ్చు.