రాజేంద్రనగర్ ( హైదరాబాద్) : రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రియల్ ఎస్టేట్‌తో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRSV) రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఫొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ (University) లో విద్యార్థులు చేపడుతున్న ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు.
అనేక దశాబ్దాల క్రితం వ్యవసాయ , అనుబంధ రంగాలకు కేటాయించిన భూములను ఎవరితో చర్చించకుండా హైకోర్టు ( High Court) కు ఇవ్వాలను కోవడం దారుణమని అన్నారు. జీవో నంబర్ 55ను రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. వర్సిటీ భూములలో పెరిగిన వన , జీవరాశులను నాశనం చేయడం సరికాదన్నారు. వర్సిటీ భూములను కాపాడుకునేందుకు నాయకులు చేయాల్సిన ఉద్యమాలకు బదులుగా విద్యార్ధులు భవిషత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు.
శాంతియుతంగా చేపడుతున్న ఉద్యమానికి పోలీసులచేత దాడులు చేయించడం విడ్డూరమన్నారు. వర్సిటీ ఇతరులకు అప్పగిస్తే , పొల్యూషన్‌తో మరో ఢిల్లీలా హైదరాబాద్ నగరం అవుతుందని హెచ్చరించారు. వ్యవసాయ ,ఉద్యాన వర్సిటీ యూనివర్సిటీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కట్టబెట్టడానికి ప్రభుత్వం జీవో నంబర్‌ను 55ను విడుదల చేశారన్నారు. అవసరమైతే సమీపంలోని మరో వెయ్యి ఎకరాలు వర్సిటీకి ఇవ్వాలని సూచించారు. వర్సిటీ విద్యార్థినీ నాయకులు , బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు .