HYDRAA | నగరంలో ఇప్పటి వరకు మొత్తం 923 ఎకరాలను సంరక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.50వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించామన్నారు. నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని.. నగరంలో ఆరు చెరువులను పూర్తిగా పునరుజ్జీవం చేశామన్నారు. నిన్న గాజులరామారంలోని ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలనే తొలగించామని.. గాజులరామారంలోని నకిలీ పట్టాలు తీసుకొని నిర్మాణాలు చేపట్టారన్నారు. ప్రభుత్వ భూమిలోని 260 నిర్మాణాలను మాత్రమే తొలగించామన్నారు. గాజులరామారంలోని కొందరు రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తెలిపారు.
ప్రస్తుతం 51 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.. త్వరలోనే 72కి పెంచుతామన్నారు. నగరంలో 150 మాన్సూర్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయని.. ఆక్రమణలకు గురైన నాలాలు గుర్తించి ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. నాలాల్లో పూడిక తొలగింపును ముమ్మరం చేశామని.. వర్షం నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి, నీరు నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. కాంక్రీటైజేషన్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదని.. అధిక పొల్యూషన్ వల్ల నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయన్నారు. పార్కులు, చెరువుల గురించి జన్ జెడ్ ఆలోచించాలని.. భవిష్యత్ అంతా యువతరానిదే కాబట్టి చెరువుల సంరక్షణ గురించి ఆలోచించాలని రంగనాథ్ పిలుపునిచ్చారు.