సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ముషీరాబాద్ సర్కిల్ భోలక్‌పూర్ వార్డులోని అంజుమన్ స్కూల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్‌ను కమిషనర్ రొనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి పరిశీలించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 10 లక్షల దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్‌లకు సంబంధించిన దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల రోజులు పూర్తయ్యాయని, ఈ సమయంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ముషీరాబాద్ బోలక్పూర్ వార్డు పరిధిలో పద్మశాలీ కాలనీ, డీఎస్ నగర్, ఎస్బీఐ కాలనీ, దేవుడి తోట వాంబాయి క్వార్టర్స్ , మండి గల్లీ వరకు దరఖాస్తులు పూర్తయ్యాయని, మిగిలిన పీఅండ్‌టీ కాలనీ, సాయిబాబా నగర్లలో 4, 5వ తేదీల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, స్పెషల్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, ముషీరాబాద్ ఎమ్మార్వో లక్ష్మి, ఆర్డీఓ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు వాజీద్ హుస్సేన్, కల్పనా యాదవ్, నాయకులు గుర్రం శంకర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లబెల్లి అంజిరెడ్డి, మేడీ సురేష్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.