వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 13: పల్లెల్లో రెండేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వీధుల్లో నవ్వులపాలవుతున్నది. అక్రమాలు, డబ్బు సంచులకు తలవంచని ఓటరుతోపాటు, ఉద్యమ ఊపిరితో ఎదురు నిలుస్తున్న బీఆర్ఎస్ యువ నేతలు సైతం గట్టి పోటీనిస్తున్నారు. దీంతో వారిపై తప్పుడు కేసులు పెట్టడంతోపాటు ఓటర్లను కాంగ్రెస్ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజుల ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల బ్యానర్స్ తొలగించడం, దాడులు చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వు సీట్ల వద్ద కాంగ్రెస్ నేతలు తమ పాలేర్లను, నిరక్ష్యరాసులను ఎంపిక చేసి బరిలో నిలిపారు. ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ అభ్యర్థులు యువత, మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారు పోటీలో నిలవగా, డబ్బుల మూటలతో గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్.. పాతబావులు, గోడలు ఖాళీ చేయించి, వనాల సంరక్షణ, ఇంటింటికీ తాగు, సాగు నీరు, నిరంతర విద్యుత్ కల్పించి, పల్లెలను సుందరంగా తీర్చిదిద్దారని, ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేతల అరాచకాలను దీటుగా ఎదుర్కొంటున్నారు. తొలి విడతలో వచ్చిన ఫలితాలు మరింత బీఆర్ఎస్కు బలానిస్తోందని బలంగా నమ్ముతున్నారు.
అన్నీ మేమే ఇస్తాం ఒట్టేసి చెప్పండి…
రెండో విడత స్థానిక ఎన్నికలు మరింత రసవత్తరంగా జరుగనున్నాయి. నగరంలో వివిధ వృత్తులు, ఉపాధి, ఉద్యోగాల వల్ల నగరంలో నివాసం ఉంటున్న ఓటర్లకు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు గాలం వేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో నివాసం ఉంటున్న తాపి మేస్త్రీ లక్ష్మణ్‌కు శనివారం గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఫోన్ వచ్చింది. ‘నీ కుటుంభంలో ఆరు ఓట్లు ఉన్నాయి. అమ్మను సర్పంచ్ అభర్థిగా బరిలో ఉంచాం, కాంగ్రెస్ బలపర్చింది. ఖర్చులన్నీ భరిస్తాం, నీవు ఓకే అంటే ఈ నంబర్‌కు ఫోన్ పే చేస్తాం, కానీ మాపై ఒట్టేసి చెప్పు’ అనగానే, ‘అయ్యా ఇప్పటికి రెండేళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్, ఇక ఎలా అభివృద్ధి చేస్తుంది, డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా, మా స్వంత డబ్బులతో వచ్చి బీఆర్ఎస్ బలపర్చిన వారికే ఓటు వేస్తాం’ అని చెప్పడంతో ఆ అభ్యర్థికి చెంపపెట్టుగా మారింది. ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.