సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ):బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని హైడ్రా తెలిపింది. మంగళవారం కుంటలో పూడిక తీస్తుండగా నీరు పెల్లుబికి వచ్చింది. మోకాలు లోతు మట్టితీయగానే గంగమ్మ బయటకు వచ్చిందంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్ధాలుగా నింపిన మట్టిని తొలగిస్తే చెరువు నీటితో కళకళలాడుతుందని వారు పేర్కొన్నారు. అంబర్‌పేట మండలం బాగ్అంబర్పేటలోని సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13ఎకరాలుగా సర్వే అధికారులు తేల్చారు.
తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే కాగా ఈ మిగిలిన విస్తీర్ణంలోనే బతుకమ్మకుంటను పునరుద్దరించడానికి హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు పలువురు రెవెన్యూ,మున్సిపల్, ఇరిగేషన్, సర్వే అధికారులు బతుకమ్మకుంట ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నివాసమున్న వారికి ఎలాంటి ముప్పులేకుండా చెరువు తవ్వాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో బతుకమ్మకుంట పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టారు. కాగా అది ఉబికి వచ్చిన నీరు కాదని అక్కడి పైప్‌లైన్ పగలడం వల్లే అలా జరిగిందని పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని జలమండలి అధికారులు కొట్టపడేశారు.