Millets | వ్యవసాయ యూనివర్సిటీ, హైదరాబాద్ మార్చి 3 : చిరుధాన్యాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి భగీరథ చౌదరి తెలిపారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు చిరుధాన్యాల సాగు వల్లే సాధించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నాడు జాతీయ చిరుధాన్యాల కిసాన్ మేళాను నిర్వహించారు. భారతీయ చిరుధాన్యాల సంస్థ ఐసీఏఆర్ఐఎన్ఆర్ ఎన్ ఆర్ సంచాలకులు తార సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి భగీరథ చౌదరి మాట్లాడుతూ.. భారత్లో చిరుధాన్యాల సాగుకు వాతావరణ పరిస్థితులు, నేలలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కరోనా అనంతరం చిరుధాన్యాల ఉత్పత్తులకు అధిక డిమాండ్ పెరిగిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో గల వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ సదస్సుకు హాజరు కావడం అభినందనీయమని కొనియాడారు. చిన్న కమతాలు ఉన్నాయని దిగులు చెందకుండా చిరుధాన్యాల సాగు మంచిగా పండించి అధిక ఉత్పత్తిదారులకు ఎక్కువ ధరలకు చెల్లించే వారికే విక్రయించాలని ఆయన సూచించారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహించడం వల్ల పర్యావరణ పరిరక్షణ వేసవిలో సైతం వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు చిరుధాన్యాల సాగు వరమని.. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అతి తక్కువ రసాయన ఎరువులు తప్పని పరిస్థితుల్లో వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య అన్నారు. చిరుధాన్యాలకు జనాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అధిక ధరలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందని అన్నారు. తక్కువ వర్షపాత కాల ప్రాంతాల్లో కూడా చిరుధాన్యాలు పండుతాయని తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు వికసిత్ భారత్లో భాగంగా చిరుధాన్యాల అధునాతన సాగు పద్ధతులు, ఉత్పత్తులు, పరిశ్రమల స్థాపనకు సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు.