సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): జలమండలిలో నీళ్ల దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. విభిన్న రూపాల్లో మంచినీళ్లను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లలో నీటి అక్రమ సరఫరా యథేచ్ఛగా సాగుతున్నది. ఎండాకాలంలో జోరుగా సాగిన ఈ నీటి దోపిడీ.. వర్షాకాలం మొదలైనా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల దాకా పర్యవేక్షణ కొరవడటంతో జలదోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
ఏకంగా పదివేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్ల ద్వారా అక్రమ మార్గంలో వేలాది రూపాయలకు కమర్షియల్‌గా విక్రయిస్తున్నారు. భవన నిర్మాణాలు, పరిశ్రమలకు వందలాది ట్యాంకర్లు తరలిపోతున్నాయి. ఓ వైపు వినియోగదారుల నుంచి రిజర్వాయర్ ఇన్చార్జులే అదనంగా వసూలు చేస్తున్న ఉదంతాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు ఫిల్లింగ్ స్టేషన్ల క్లోజింగ్ టైమ్ అయిపోయాక కూడా వందలాది ట్యాంకర్ల నీటిని అక్రమంగా విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, జలమండలి పరిధిలోని పలు చాలా వరకు ఫిల్లింగ్ స్టేషన్లలో సాయంత్రం గేట్ పాస్‌ల క్లోజింగ్ సమయం అయిపోయినా అ నధికారికంగా తెరిచే ఉంటున్నాయి.
బుకి ంగ్లు లేకుండానే ఫిల్లింగ్ స్టేషన్ ఇన్‌ఛార్జులు ట్యాంకర్ యజమానులతో కుమ్మ క్కై వందలాది ట్యాంకర్ల నీటిని ప్రైవేట్‌గా విక్రయిస్తున్నారు. ఈ అక్రమ నీటి దందా అర్ధరాత్రి దాటేదాకా సాగుతున్నది. ఈ వ్యవహారం అంతా ఆయా మేనేజర్లు, ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతున్న ట్లు సమాచారం. ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పీర్జాదిగూడ ఫిల్లింగ్ స్టేషన్లో గత నాలుగు నెలలుగా రోజూ వందల నీటి ట్యాంకర్లు అక్రమంగా తరలిపోతున్నాయి. రాత్రిళ్లు అనధికారికంగా రూ.2 వేల నుంచి రూ.10 వేలకు ఒక ట్యాంకర్ చొప్పున విక్రయిస్తున్నారు. జూన్ 1న ట్యాంకర్ల గేట్ పాస్ ఉదయం 6.35 నిమిషాలకు ఓపెన్ చేశారు. రాత్రి 8.44 గంటలకు చివరి డెలివరీని పంపించారు. ఆ తర్వాత ఫిల్లింగ్ స్టేషన్ గేట్ పాస్‌లు క్లోజ్ చేశారు. కానీ ట్యాంకర్ల సరఫరా మాత్రం అర్ధ రాత్రి 12 గంటలు దాటినా కొనసాగింది. రోజూ ఇదే తరహాలో కొనసాగుతున్నది. ఆయా ట్యాంకర్లను చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న భవనాలకు విక్రయిస్తున్నారు.
అక్రమంగా సరఫరా చేస్తున్న ఒక్కొక్క ట్యాకర్కు దూరాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేలదాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదంతా ఫిల్లింగ్ స్టేషన్, ఇన్చార్జి, సంబంధిత అధికారుల అండతోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ దందా నిత్యం కొనసాగుతూనే ఉంది. బహిరంగంగా నీటిని అక్రమంగా తరలిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ పరిసరాల్లో జలమండలి సరఫరా సరిగ్గా రాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాని జలమండలి సిబ్బంది, అధికారులు మాత్రం మంచినీటిని అక్రమంగా అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా అక్రమ నీటి దందాను అరికట్టాలని కోరుతున్నారు.