Hyderabad | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట జిల్లా కుకునూర్ వద్ద రైల్వే శాఖ నూతనంగా ట్రాక్లైన్ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి తొలి విడత పథకంలో భాగంగా కొండపాక నుంచి ఘన్‌పూర్‌కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్‌ను పక్కకు మార్చాల్సి ఉంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 66 గంటల పాటు ఈ పనులు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో 66 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలోని నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.
షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి డిఫెన్స్ కాలనీ, నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట) , ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి) ఘన్పూర్ (మేడ్చల్/శామీర్‌పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాల్లో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని అధికారులు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని అధికారులకు సహకరించాలని కోరారు.
బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, ఆమీర్‌పేట, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్‌గూడ, కేపీహెచ్‌బీ కాలనీ, మలేషియా టౌన్షిప్, లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు ప్రాంతాలు, గోపాల్‌నగర్, మయూర్ నగర్ రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్, నిజాంపేట్/బాచుపల్లి ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరా ఉంటుందని అధికారులు తెలిపారు.