Water Problems | దుండిగల్, మార్చి 15 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎండలు ముదరక ముందే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా మురికివాడలు, బస్తీలలో ఈ సమస్య అధికంగా వేధిస్తున్నది. అసలే నాలుగైదు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా అవుతుండగా, అది లో ప్రెషర్‌తో వస్తుండడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు.
నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లతోపాటు కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో తాగునీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. గతంలో రోజు విడిచి రోజు వచ్చే తాగునీరు ప్రస్తుతం నాలుగైదు రోజులకు ఒకసారి వస్తుందనీ, అది కూడా అర కొరగానే వస్తుండడంతో ప్రజలు ట్యాంకర్ ల వైపు చూస్తున్నారు. కొన్నిచోట్ల గంటల కొద్ది సమయం తీసుకుంటున్న జలమండలి వాటర్ ట్యాంకర్లు, మరికొన్ని ప్రాంతాలలో మాత్రం 24 గంటల వరకు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని ప్రజలు పేర్కొంటున్నారు. అదే సమయంలో ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు సైతం ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ అందరకాడికి దండుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి తాగునీటి సరఫరాను మెరుగు పరచాలని కోరుతున్నారు.