సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు. ఈ వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో దాదాపుగా 30వేలకు పైగా కుటుంబాలు అధికంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నాయి. ఆ ప్రాంతాల్లో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు మొత్తం 18 స్వచ్ఛంద సంస్థల ద్వారా జలమండలి ఇంకుడు గుంతల సర్వే చేపట్టింది. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి.. ఇప్పటికే 4736 కుటుంబాలపై సర్వే చేశారని రెవెన్యూ డైరెక్టర్ తెలిపారు. వీరంతా ఆయా కుటుంబాలకు ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకత, అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఫలితంగా 2884 కుటుంబాలు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నాయని వెల్లడించారు. 296 కుటుంబాలు వినియోగంలో లేని వాటికి మరమ్మతులు చేసుకున్నట్లు వివరించారు. మిగిలిన 1852 కుటుంబాలు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాల్సి ఉన్నదన్నారు. ఆయా కుటుంబాలకు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షలో సింగిల్ విండో సెల్ జీఎం దామోదర్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.