సిటీ బ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): నగరంలో తాగునీటి ఎద్దడి వల్ల ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు జలమండలి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. బుక్ చేసుకున్న నాటి నుంచి ట్యాంకర్ వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా.. అని పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ట్యాంకర్ బుక్ చేసుకుని మూడు, నాలుగు రోజులు దాటినా ఇంటికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే బుక్ చేసుకున్న వినియోగదారుడు జలమండలి కార్యాలయం నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే ఒకవేళ ఫోన్ వచ్చిన వెంటనే లిఫ్ట్ చేయకుంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.. ట్యాంకర్ బుక్ చేసుకున్నాక.. సదరు వ్యక్తి టోకెన్ నెంబర్ సీరియల్ రాగానే జలమండలి సిబ్బంది నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ ట్యాంకర్ డెలివరీకి సిద్ధంగా ఉంది.. మీకు కావాలా? అని అడుగుతున్నారు. కావాలని చెప్తేనే ఆరోజు డెలివరీ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఫోన్ లిఫ్ట్ చేయడానికి వీలు కాకుంటే.. ఆ వ్యక్తి సీరియల్ నెంబర్ వెనక్కి వెళ్తున్నది. దీంతో మరో రెండు మూడు రోజులదాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జలమండలి వినియోగదారులు వాపోతున్నారు. ఇదే అదనుగా ట్యాంకర్ యజమానులు సదరు ట్యాంకర్ను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
మూడు నాలుగు రోజుల దాకా..
జలమండలిలో సరఫరాకు కేటాయించాల్సిన నీటిని ట్యాంకర్లకు కేటాయిస్తుండటం వల్లనే ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇండ్లలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, సరఫరా తగ్గించడంతో తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డిమాండ్ విపరీతంగా ఏర్పడి బుకింగ్ చేసుకున్న మూడు నాలుగు రోజుల దాకా ట్యాంకర్ రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. సరఫరాకు వినియోగించాల్సిన నీటిని ట్యాంకర్లకు మళ్లించొద్దని కోరుతున్నారు. అదే విధంగా అపార్ట్మెంట్లు, హైరైజ్ బిల్డింగ్లకు ఎక్కువ సమయం సరఫరా చేస్తున్నారని, బస్తీలు, కాలనీలకు మాత్రం సరఫరా సమయం కుదించడంతో ఎద్దడి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సరఫరా నీటిని ట్యాంకర్లకు మళ్లించొద్దని వేడుకుంటున్నారు. ట్యాంకర్లను బుక్ చేసుకున్న 24 గంటల్లోనే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.