సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : వచ్చే వేసవి కాలం దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి సరఫరాలో జాప్యం ఉండొద్దని, వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలను రూపొందించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తట్టిఖానా సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్యాంకర్ డెలివరీ, వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. సకాలంలో ట్యాంకర్ డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
హాస్టళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, మాల్స్ తదితర వినియోగదారులతో అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. రాత్రి సమయంలోనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ఈ సెక్షన్ పరిధిలో 20 ట్యాంకర్లు ఉండగా, రోజుకు 150 ట్రిప్పులను డెలివరీ చేస్తుండగా, ఏప్రిల్ నాటికి 400 ట్రిప్పులకు పెంచేలా ఫిల్లింగ్ స్టేషన్లు, ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. గతేడాది ఏప్రిల్లో ఏకంగా 1.70 లక్షల ట్యాంకర్ల నీటిని డెలివరీ చేసినట్లు అధికారులు తెలిపారు.