బంజారాహిల్స్, ఏప్రిల్ 11: ‘ఎండాకాలం రాకముందే నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు..‘ కనీసం బాత్రూం వెళ్లేందుకు నీళ్లు లేవు.. పైసలు ఇచ్చిన వాళ్ల ఏరియాకే నీళ్లు వదులుతున్నారు.. ’ ‘లో-ఫ్రెషర్‌తో నాలుగు రోజులకు ఓసారి వస్తున్న నల్లా నీళ్లు సరిపోవడం లేదు.. ’అంటూ బస్తీవాసులు బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని నందినగర్,వెంకటేశ్వనగర్ బస్తీల్లోని పలు వీధుల్లో ఆరునెలలుగా మంచినీటి సరఫరాపై జలమండలి లైన్మెన్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్థానిక లైన్మెన్లు తమకు నచ్చిన ఏరియాలకు నీళ్లు ఎక్కువగా ఇవ్వడం, మరికొన్ని ఏరియాలకు నాలుగురోజులకు ఒకసారి ఇస్తూ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలరోజులుగా వెంకటేశ్వరకాలనీ, స్టడీసర్కిల్ వెనకాల బస్తీలో మంచినీరు సరిగా రావడం లేదు. నాలుగురోజులుగా ఈ బస్తీల్లో నీళ్లు రాకపోవడంతో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, స్థానికులు తట్టిఖానా సెక్షన్ కార్యాలయం ముట్టడించారు.
స్థానిక మహిళలు జలమండలి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగురోజులకు ఒకసారి చిటికెన వేలంత ప్రెషర్‌తో నీళ్లు వస్తున్నాయని, జలమండలి లైన్మెన్లు ఎన్నో ఏళ్లుగా ఈ ఏరియాలో పాతుకుపోయి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. నీటి సమస్యలు పరిష్కారం కాకపోతే మరోసారి ఆందోళన చేస్తామని స్థానిక నేత రాములు చౌహాన్, బల్లూ రాథోడ్ తదితరులు హెచ్చరించారు.