బంజారాహిల్స్,జూలై 4: నగరం నడిబొడ్డున సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా.. జలమండలి మేనేజర్ మార్పు, జిల్లా కలెక్టర్ మార్పుతో మరో ప్రయత్నం చేసి స్థలంలో తిష్టవేసేందుకు కబ్జాదారులు రంగం సిద్ధం చేస్తున్నారా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సుమారు ఏడునెలలుగా జలమండలి, రెవెన్యూశాఖ అధికారులతో దోబూచులాడుతున్న కబ్జాదారులు శుక్రవారం తెల్లవారుజామున మరోసారి స్థలంలోకి ప్రవేశించారు. దీంతో అప్రమత్తమైన జలమండలి సిబ్బంది విజిలెన్స్ విభాగం అధికారులకు సమాచారం అందజేయడంతో పరిశీలించారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండల సర్వే నంబర్ 403/పీ, టీఎస్ నంబర్-1/1/1, బ్లాక్ హెచ్, వార్డు -10 పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్ర భుత్వ స్థలంలో 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్థలాన్ని బోగస్ పత్రాలతో కబ్జా చేసేందుకు కొన్నినెలలుగా పలువురు వ్యక్తులు ప్రయత్నాలు చేయడం, వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ కబ్జాల వ్యవహారంపై గత ఏడాది డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పలుమార్లు నమస్తే తెలంగాణ వరుస కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు స్థలంలో తిష్టవేసిన పార్థసారథి అనే వ్యక్తితో పాటు అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా అప్పటినుంచి జలమండలి విజిలెన్స్ విభాగం సంరక్షణలో ఈ స్థలం ఉంది. కొన్నిరోజులుగా విజిలెన్స్ విభాగం సిబ్బంది బందోబస్తు తొలగించడంతో స్థలంపై కన్నేసిన కబ్జాదారులు గురువారం రాత్రి మరోసారి ప్రవేశించారు. స్థ లంలో బ్లూషీట్స్తో తాత్కాలిక నివాసం ఏ ర్పాటు చేసుకోవడంతో అక్కడున్న గదిలో తిష్టవేశారు.
ఈ వ్యవహారంపై స్థానిక జలమండలి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ డీఎస్పీ జ్ఞానేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించి అక్కడే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని జలమండలి జీఎం ప్రభాకర్‌రావు తెలిపారు. కాగా ఈ స్థలంపై కన్నేసిన పార్థసారథికి చెందిన మనుషులే స్థలంలో ప్రవేశించారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.