Jalamandali | సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌వ్యాప్తంగా తాగునీరందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య విలయ తాండవం సృష్టిస్తున్నది. ఎక్కడ చూసినా సరఫరా లేకపోవడం, లో ప్రెషర్ సమస్యలు వేధిస్తున్నాయి. అధికారులు తాగునీటి సరఫరా తగ్గించి ట్యాంకర్లకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే బస్తీలు, కాలనీలకు రావాల్సిన నీటిని ధనవంతులు నివసించే అపార్ట్మెంట్లు, హైరైజ్ భవనాలకు తరలిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు భారీ మొత్తంలో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలోని జలమండలి సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో డెలివరీ కావడం లేదు. చాలామందికి బుక్‌చేసుకున్నాక టోకెన్ రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతున్నది. సిబ్బంది, ట్యాంకర్ల యజమానులకు అనుకూలమైన వారికి మాత్రం సకాలంలో డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో జలమండలి అధికారులు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రోజంతా డెలివరీ చేసేలా నిబంధనలు సడలించారు. అయినా సకాలంలో డెలివరీ కాకపోవడం జలమండలి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలు అవుతున్నది. జలమండలి పరిధిలోని ఏ ఫిల్లింగ్ స్టేషన్లోనైనా 24 గంటలలోపు ట్యాంకర్ డెలివరీ కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు దృష్టిపెట్టి ట్యాంకర్లు 24 గంటల్లోపు డెలవరీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ట్యాంకర్లు సకాలంలో డెలవరీ కాకపోవడంతో వినియోగదారులు రెండోసారి బుక్ చేసుకుంటున్నారు. రెండుమూడు రోజులు వేచి చూసి నీటి సమస్య తీవ్రమవుతుండటంతో మరోసారి బుక్ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ట్యాంకర్లు వేలాదిగా పెండింగ్‌లో ఉంటున్నాయి. గురువారం ఏకంగా 20,900 ట్యాంకర్లు పెండింగ్‌లు ఉన్నాయి. సిబ్బంది సకాలంలో డెలివరీ చేస్తే ఇంత మొత్తంలో పోగుపడేవి కాదు. టోకెన్ నంబర్ వచ్చినవారికి ట్యాంకర్ యజమానులు ఫోన్ చేసిన సమయంలో పలుకారణాలతో లిఫ్ట్ చేయకుంటే వాటిని పక్కదారి పట్టిస్తున్నారు.
ట్యాంకర్ బుక్ చేసుకున్న ట్యాంకర్ డ్రైవర్లు, యజమానులకు తెలిసిన వ్యక్తులకు డెలివరీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఒక వ్యక్తి బుక్ చేసుకున్న ట్యాంకర్‌ను టోకెన్ రాకున్నా ఎక్కువ డబ్బులు తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఒక్కో వినియోగదారుడు రెండు మూడు ట్యాంకర్లు బుక్ చేసుకున్నా ఇండ్లకు చేరని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా డెలివరీ వేగవంతంగా చేయకపోవడం వల్ల భారీ మొత్తంలో పెండింగులో ఉంటున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ట్యాంకర్ల డెలివరీలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఎండల తీవ్రత తగ్గేదాకా ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.