సిటీబ్యూరో: దీర్ఘకాలికంగా నల్లా పెండింగ్‌లో ఉన్న వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చిన ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అమల్లో ఐటీ అధికారుల నిర్లక్ష్యంపై జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ సీరియస్ అయ్యారు. సాంకేతిక సమస్యలు తరచూ ఎందుకు వస్తున్నాయంటూ బుధవారం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటీఎస్ ఆమల్లో ఐటీ విభాగం మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లు చెల్లిస్తే ఆలస్య రుసుముతోపాటు వడ్డీపై రాయితీ పొందాలని వినియోగదారులకు సూచిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. 17 రోజుల తర్వాత (ఈ నెల 22వ తేదీ)న జలమండలి అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వినియోగదారులు ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి డివిజన్ నుంచి రోజుకు 30 నుంచి 50 మంది వస్తుండటం, వారం రోజుల కిందట బకాయి మొత్తం చెల్లించిన మాఫీ అయినట్లు చూపించడం లేదంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా మేనేజర్ నుంచి డీజీఎం, జీఎం, సీజీఎం స్థాయిలో నిర్దేశించిన బిల్లును సంబంధిత అధికారి అఫ్రూవల్ చేసే ప్రక్రియలో సాంకేతిక సమస్య రావడంతో ఈ ఆందోళనకు కారణమైంది. ఈ అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఈడీ.. సంబంధిత రెవెన్యూ, ఐటీ అధికారుల నుంచి సమగ్ర వివరాలను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. బుధవారం సైతం కొన్ని డివిజన్లలో సాంకేతిక సమస్యలు తప్పలేదు. అఫిడవిట్ సమర్పించగా..అఫ్రూవల్ చేసే క్రమంలో సాఫ్ట్‌వేర్‌లో 100 ఎంబీ (అఫిడవిట్ పీడీఎఫ్ ఫైల్) కంటే ఎక్కువగా ఉంటే ఇబ్బందులు రావడం, ఆన్లైన్ అఫ్రూవల్పై అధికారులు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో వినియోగదారుల బిల్లు మాఫీపై స్తబ్ధత నెలకొంది. మొత్తంగా వరుస పండుగల సమయంలో ఓటీఎస్ రావడం, అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయి అమలు కాకపోవడం, చివరి 9 రోజుల సమయంలో ఆశించిన స్థాయిలో వినియోగదారులు సద్వినియోగం చేసుకోకపోవడం, మరో నెల పాటు అధికారులు సమయం కోరడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరో నెల పాటు సమయం ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.