విశ్వనగరంగా ఖ్యాతి గడిచిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కంపుకోడుతోంది.. పారిశుధ్య నిర్వహణలో చిత్తశుద్ధి లోపించడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. రహదారులు దుర్వాసన వెదజల్లుతున్నాయి.. రోగాలు ప్రభలుతున్నాయి. ఇటీవల ప్రజారోగ్యమే లక్ష్యంగా బల్దియా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను కంటి తుడుపుగా చేపట్టింది. కమిషనర్ నుంచి కార్మికుడి వరకూ ‘పరిశుభ్ర హైదరాబాద్’ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తారని, ప్రతి రోజూ నిత్యం శానిటేషన్ కార్యక్రమాల తర్వాత రోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్లు కార్యక్రమం మొదటి నాలుగు రోజుల్లో హడావుడి చేశారు తప్ప.. చేసిందేమీ లేదు. తూతూ మంత్రంగా కార్యక్రమానికి ముగించేశారు. దీనికితోడు ఒకవైపు వర్షాలు..మరోవైపు వ్యర్థాలతో జనం అవస్థలుపడుతున్నారు. దోమలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రి పాలవుతున్నారు. వ్యర్థాలు తొలగించకపోగా, స్పెషల్ డ్రైవ్‌లోనూ ఇష్టారీతిన చెత్త వేసే వారిపై పెనాల్టీల మోత మోగించడం స్పెషలైతే.. వ్యర్థాల ఎత్తివేత మరిచి.. జరిమానాలు విధించడంపై జనం జీహెచ్ఎంసీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)
ప్రజారోగ్యమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను కంటి తుడుపు చర్యగానే ముగించారు. 150 వార్డుల్లో వర్షాకాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని గత నెల 29 నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించారు. అయితే కార్యక్రమం చివరి మూడు రోజుల్లో స్పెషల్ డ్రైవ్‌ను చాలా చోట్ల చేపట్టలేదు. వర్షాల కారణంతో చేతులేత్తేశారు. మొత్తంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో అన్ని వార్డులు పరిశుభ్రతతో పాటు(గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) పాయింట్లకు శాశ్వత విముక్తి దక్కుతుందని భావించిన పౌరులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే ప్రస్తుతం వర్షాలు పడుతున్న వేళ ఎక్కడ పడితే అక్కడే చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే చిత్తడి ఒక వైపు , మరోవైపు దోమల స్వైర విహారంతో డెంగీ విస్తరిస్తుండగా, అధికారుల తీరు తమను ఆస్పత్రి పాలు చేస్తున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే 11 రోజుల పాటు పారిశుధ్యంపై జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో 82 చోట్ల డెంగీ కేసులను గుర్తించడం గమనార్హం.
1007 ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా, 1992 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించారు. భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి 1004 మెట్రిక్ టన్నులను తరలించారు. సాధారణ రోజుల్లో రోజుకు 7వేల మెట్రిక్ వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా, నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి కొద్ది మేరలో అదనపు వ్యర్థాలను తరలించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఏఎంఓహెచ్ (వైద్యాధికారులు) 4561 ఇండ్లను పరిశీలించగా, 2,95,216 ప్రాంతాల్లో ఫాగింగ్ చర్యలు చేపట్టారు. 82 చోట్ల డెంగీ కేసులను గుర్తించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి.. 161 చోట్ల క్యాచ్పిట్లు, 19 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు జరిపినట్లు రికార్డుల్లో అధికారులు పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పరిశుభ్రంగా మార్చడం ఏయో కానీ స్పెషల్ డ్రైవ్‌లోనూ పెనాల్టీల మోత మోగించారు. రోడ్లు, ఖాళీల స్థలాల్లో ఇష్టారీతిన చెత్త వేసే వారిని గుర్తించి వారికి బల్దియా జరిమానాలను విధిస్తున్నది. దీంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టగుట్టలుగా రహదారుల వెంబడి, చెరువులు, నాలాల వెంబడి పారబోస్తున్న వారిని లక్ష్యంగా చలాన్లు విధిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500ల నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి సీసీఎంఎస్ ద్వారా రూ. 25 వేల నుంచి రెండు లక్షల వరకు జరిమానాలు వేస్తున్నారు. 466 మంది నుంచి రూ.24 లక్షల పెనాల్టీలు వేశారు.
వర్షాలు పడుతున్న వేళ పారిశుధ్య నిర్వహణలో జాప్యంతో జీవీపీ పాయింట్లతో పాటు పలు కాలనీలు, రహదారులపై ముక్కుపుటలదిరే దుర్వాసన వెదజల్లుతున్నది. అయితే వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీని చక్కదిద్దేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధి చెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో పారిశుధ్య నిర్వహణకు మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.