Janardhan Rao | సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ):ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్‌రావు హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జనార్దన్‌రావు (86)ను ఆయన మనువడు కిలారు కీర్తితేజ(29) హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన ఇంట్లోనే అతి కిరాతకంగా హత్య చేశాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది. పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. మరోవైపు కీర్తితేజ డ్రగ్స్ తీసుకుంటారన్న సమాచారం నేపథ్యంలో ఆయన బ్లడ్శాంపిల్స్ను ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో ఎప్పుడూ ఇంత కిరాతకంగా చంపిన దాఖలాలు లేవని, ఒక వ్యక్తిపై ఎంత కసి ఉంటే ఈ రకంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపుతారంటూ పోలీసులే చర్చించుకుంటున్నారు. కీర్తితేజ కత్తి ఇంట్లో నుంచే తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఆయుధం వాడిన తీరుపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్నదెవరు..!
జనార్దన్‌రావు హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతున్నది. కిలారు కీర్తి తేజ తన తాతను చంపేందుకు ముందు ఆయనతో గొడవ పెట్టుకున్నాడని, ఆ సమయంలో ఇంట్లో కీర్తితేజ తల్లి సరోజ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. జనార్దన్‌రావును చంపే సమయంలో అడ్డువచ్చిన తల్లిపై కూడా కీర్తితేజ దాడి చేశాడు. దీంతో ఆమెకు సుమారు 12 కత్తిపోట్లు పడ్డాయి. కేకలు విన్నవెంటనే వచ్చిన సెక్యూరిటీగార్డ్ను కూడా కీర్తితేజ చంపుతానని బెదిరించి పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. కొన్నేళ్లుగా ఈ కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని, జనార్దన్‌రావు కంపెనీలో వాళ్ల ఇంకో అమ్మాయి కొడుకు శ్రీకృష్ణను డైరెక్టర్‌గా నియమించడంతో కీర్తితేజకు కోపం వచ్చినట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.
కానీ కీర్తి తేజ పేరిట 4కోట్ల షేర్లను జనార్దన్‌రావు ట్రాన్స్ఫర్ చేశారు. అయినా డైరెక్టర్ పదవి కావాలంటూ తనను సరిగా చూడటం లేదంటూ కీర్తి తేజ ప్రతీరోజూ తాను ఒంటరిగా ఉంటున్న ల్యాంకోహిల్స్ ఫ్లాట్ నుంచి తన తాత ఇంటికి వచ్చి గొడవపడేవాడని తెలుస్తున్నది. కీర్తితేజకు డైరెక్టర్ పదవి కావాలని అడిగేలా ఉసిగొల్పిన వ్యక్తులెవరు..కుటుంబసభ్యులు కానీ, బయటవారు కానీ ఎవరైనా కీర్తితేజను డైరెక్టర్ కావాలని అడగమని చెప్పారా? పోలీసులు వెలిబుచ్చుతున్న సందేహాలివి. జనార్దన్‌రావుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం కావడంతో ఇందులో ఎవరి ప్రమేయమేంటి? విచారణలో ఏం తేల్చనున్నారు?పంజాగుట్ట పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
మత్తులో చేశాడా..!
జనార్దన్‌రావు హత్య కేసుకు సంబంధించి కీర్తితేజ విషయంలో పోలీసులు మరో విషయంపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కీర్తితేజకు డ్రగ్స్ అలవాటు ఉండటం వల్ల ఆయనను డిఅడిక్షన్ సెంటర్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ మళ్లీ డ్రగ్స్ వాడుతుండటంతో జనార్దన్‌రావు సీరియస్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు. అయితే కీర్తితేజ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించామని అక్కడ నుంచి నివేదిక వచ్చాక వివరాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు. డ్రగ్స్ అయితే అతను ఏం డ్రగ్ వాడుతున్నాడు.. అతనికి సప్లై చేసిందెవరు. ఇది కూడా పోలీసులను తొలుస్తున్న ప్రశ్న. సమాజంలో పేరు ఉన్న జనార్దన్‌రావు మర్డర్ కేసు ప్రస్తుతం పోలీసులకు చాలెంజింగ్‌గా మారింది. వారు ఈ కేసును అతి త్వరగా ఛేదించి నిజాలు బయటపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది.