సిటీబ్యూరో, మే 3(నమస్తే తెలంగాణ) : నగరం నడిబొడ్డున పచ్చని పందిరిలా కనిపించే కేబీఆర్ పార్క్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అభివృద్ధి పేరిట కాంక్రీట్ అడవిని నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడి వన్యప్రాణులతోపాటు ప్రకృతి సిద్ధంగా వెలసిన చిరాన్కుంట ఉనికే లేకుండా చేసేందుకు సిద్ధమైంది. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీలో భాగంగా చేపడుతున్న 1090 కోట్ల ప్రాజెక్టు కోసం జల, జీవ రాశులను బలిపీఠమెక్కిస్తోంది.
జీవవైవిధ్యానికి ప్రధాన వేదికగా నిలిచే కేబీఆర్ పార్క్‌లోని చిరాన్కుంటను నిర్వీర్యం చేసేందుకు ఏడాది కిందటి నుంచే కాంగ్రెస్ కుట్రలను అమలు చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పర్యావరణ కేంద్రంగా ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లూ, విస్తారమైన రోడ్లను నిర్మించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలతో జీవావరణం నిర్వీర్యమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ముందుగా పర్యావరణ ప్రేమికుల కళ్లుగప్పి… పార్కులో ఉన్న చిరాన్కుంటను సర్వనాశనం చేస్తోంది.
ఇప్పటికే మురుగు నీటిని మళ్లించడంతో… వేలాది చేపలు, ఆ పక్కనే ఉండే లోటస్ పాండ్ వరకు వ్యాప్తి చెందింది. ఏడాది కిందట నుంచి వాటర్ బోర్డు ముసుగులో సాగుతున్న ఈ తతంగం పక్కా పథకం ప్రకారమే చిరాన్ కుంటపై కుట్రలు సాగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షపు నీటి కాలువలను మళ్లించడం, కుంటలోకి సహజ ప్రవాహాలు రాకుండా అడ్డుకోవడం, మురుగునీటిని కుంటలోకి వదలడం, పర్యావరణవేత్తలు గగ్గోలుపెట్టిన అధికారులు పట్టించుకోక పోవడం వెనుక కాలుష్యం మాటున చిరాన్కుంటను నిర్వీర్యం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రికార్డులు చెబుతున్న నిజాలివే…
ఒకప్పుడు కుంట ఉందంటే, నిత్యం కాలుష్య నియంత్రణ మండలి విభాగం కాలుష్య తీవ్రత, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా అధ్యయనం చేస్తుండేది. ఇందులో భాగంగా ఏటా కొన్నిసార్లు కుంటలోని నీటిని సేకరించి వివరాలను నమోదు చేసేది. ఈ క్రమంలో 2024 నాటికి కొలిఫారం పరిమాణం 100ఎంఎల్ నీటిలో 814ఎంపీఎన్కు చేరింది. ఇక బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తీవ్రత కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ హెచ్ సిటీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రకటించిన నాటి నుంచే చిరాన్ కుంటపై కుట్రలకు తెరలేపిందనే అనుమానాలు కలుగుతున్నది. దీనికి పీసీబీ రికార్డుల్లో నమోదైన కాలుష్య తీవ్రతతో అసలు వాస్తవం బయటపడింది.
నిలిచిన శాంపిల్ కలెక్షన్…
ప్రాజెక్టుకు చిరాన్కుంట అడ్డు తగులుతుందని భావించి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్న సర్కార్… ముందుగా కుంటను కూల్చివేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కుంటలో కాలుష్య కాసారాలను తీవ్రతను పెంచేలా మురుగునీటిని తరలించినట్లుగా సమాచారం. ఆ తర్వాత సహజంగా వర్షపునీరు చేరే మార్గాలను అడ్డుకోవడంతో కుంటలో కాలుష్యమైంది. దీంతోనే నీటి నమూనాలను సేకరించడం, వాటిని పరీక్షించడం కాలుష్య నియంత్రణ మండలి నిలిపివేసింది. గతేడాదిలోనే ఈ ప్రక్రియను నిలిపివేయడం వెనుక అసలు కథ ఇదేనని తెలుస్తోంది.
అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న నమూనా వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేకుండా చేసిన యంత్రాంగం… కాలుష్య కాసారంగా నిర్ధారించి కుంట మనుగడను ప్రశ్నార్థకం చేయనున్నది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, మల్టీ లెవల్ జంక్షన్ల పేరిట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విధ్వంసానికి చిరాన్ కుంట కూడా అడ్డుగా ఉందనీ భావించింది. ఉన్న పళంగా ఆనవాళ్లను తుడిచివేయకుండా, ఉన్న దారులను వెతుకుతూ… ఒకప్పటి జలచరాలతో నిండుగా ఉన్న కుంట ఇప్పుడు మురుగు నీటిలో కొట్టుమిట్టాడేలా చేసింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన కాలుష్య నియంత్రణ మండలి కూడా ఈ కుట్రలో భాగస్వామి కావడంతో, కేబీఆర్ పార్క్ చుట్టూ విస్తరించిన లంగ్ స్పేస్ అనుకున్న దాని కంటే వేగంగా కనుమరుగు అవుతుందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతున్నది.