సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘పీఎం కిసాన్’ పథకానికి దరఖాస్తు చేసుకోండి’, ఎస్బీఐ రివార్డు పాయింట్లు పొందండి’ అని ఆశచూపుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ఫైళ్లను పంపి నిత్యం ఎంతో మందిని దారుణంగా మోసగిస్తున్నారు. వారి మాటలను నమ్మి గుడ్డిగా ఆ ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయగానే ఆ అమాయకుల ఫోన్లను హ్యాక్ చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు.
– హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)
సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘పీఎం కిసాన్’ పథకానికి దరఖాస్తు చేసుకోండి’, ఎస్బీఐ రివార్డు పాయింట్లు పొందండి’ అని ఆశచూపుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ఫైళ్లను పంపి నిత్యం ఎంతో మందిని దారుణంగా మోసగిస్తున్నారు. వారి మాటలను నమ్మి గుడ్డిగా ఆ ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయగానే ఆ అమాయకుల ఫోన్లను హ్యాక్ చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు 5 వేలకుపైగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేరాల వల్ల ఈ ఏడాది తెలంగాణలో బాధితులు మొత్తంగా రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోయినట్టు సమాచారం. తెలంగాణతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్‌లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
– హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఏపీకేఫైళ్లతో నష్టాలు ఇవీ.. ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడంతో వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాలకు తెలియని వ్యక్తులు, గ్రూపుల నుంచి పెద్ద సంఖ్యలో ఏపీకే ఫైళ్లు షేర్ అవుతున్నాయి. వాటిలో PM KISAN YOJANA no009.apk, ICICI Bank Credit Card Apply.apk, SBI ekyc.apk, YonoSBI.apk, SBI REWARDZ.apk ప్రధానమైనవి. ఇవన్నీ సైబర్ నేరగాళ్లు పంపుతున్న నకిలీ లింకులే. వాటిలో హానికరమైన మాల్వేర్, స్పైవేర్, ట్రోజన్ కోడ్లు ఉంటాయి. వాటిలో ఏ లింకునైనా ఓపెన్ చేస్తే యూజర్ ప్రమేయం లేకుండానే అతని ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, గ్యాలరీ, బ్యాంక్ ఖాతాలు, పాస్వర్డ్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అనంతరం ఆ యూజర్ కాంటాక్స్‌లో ఉన్న అందరికీ ఆ ఏపీకే ఫైల్ షేర్ అవుతుంది. ఎవరైనా గుడ్డిగా ఆ ఫైల్‌ను ఓపెన్ చేస్తే వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మంతా క్షణాల్లో లూటీ అవుతుంది. ఒక్క ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతోనే PM KISHAN YOJNA.apk, PM KISAN YOJANA..apk, PM KISAN YOJANA ph01.apk, PM KISAN YOJANA REGISTRA TION..apk లాంటి ప్రమాదకర మాల్వేర్స్ ఉన్నాయి.
‘పీఎం కిసాన్ యోజన’ (పీఎంకేవై) పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైళ్లను పంపి తెలంగాణలో వేల మంది అమాయక రైతులు మోసగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీంతో మరింత రెచ్చిపోతున్న కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రులపైనే పంజా విసిరారు. ‘ఎస్బీఐ రివార్డు పాయింట్ల’ పేరిట ఏపీకే ఫైళ్లను పంపి వారి వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారు. దీంతో ఎట్టకేలకు నిద్రలేచిన సైబర్ క్రైమ్ పోలీసులు.. మంత్రులకు వచ్చిన ఏపీకే ఫైళ్లపై మాత్రమే దృష్టి పెట్టారు. పీఎంకేవై పేరుతో చాలా కాలంగా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను గుర్తించడం లేదు. కనీసం ఆ మోసాల బారిన పడకుండా ఉండేలా రైతులకు అవగాహన కూడా కల్పించడం లేదు.
1 డౌన్లోడ్: ఇంటర్నెట్ ద్వారా హానికరమైన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
2 ఇన్స్టాలేషన్: ఆ ఫైల్‌పై క్లిక్ చేసిన వెంటనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. వాస్తవానికి ఆ యాప్ గూగుల్, యాపిల్ ప్లేస్టోర్లలో ఉండదు.
3 యాక్టివేషన్: యాప్ ఇన్స్టాల్ అవగానే అది యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే ఆ యాప్‌లో దాగి ఉన్న వైరస్, హానికర కోడ్ పనిచేయడం మొదలవుతుంది.
4 డాటా చోరీ: స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాంకింగ్ సమాచారం (లాగిన్ వివరాలు, ఖాతా నంబర్లు), వ్యక్తిగత వివరాలు, (పేరు, చిరునామా, ఫోన్‌నంబర్, ఆధార్), కీ లాగింగ్ (టైప్ చేసిన మాటలు/పాస్వర్డ్లు), ఓటీపీలు ఉన్న ఎస్ఎంఎస్లు సహా ఇతర సున్నిత సమాచారాన్నంతా సైబర్ నేరగాళ్లు కాజేస్తారు.
5 తస్కరించిన డాటా ఆధారంగా కేటుగాళ్లు మన పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వాటి ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహిస్తారు. మనకు తెలియకుండానే మన పేరిట రుణాలు పొందడంతోపాటు బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే సామాజిక మాధ్యమాల నుంచి హానికర ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయకూడదు. అవసరమైన యాప్‌లను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా సురక్షితంగా ఉండాలంటే Avast, Norton, Bitdefender లాంటి యాంటీ వైరస్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి, ఫిర్యాదు చేయాలి.