e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ నడవండి చాలు అదే పదివేలు

నడవండి చాలు అదే పదివేలు

నడవండి చాలు అదే పదివేలు
  • రోజూ 10 వేల అడుగులేయాల్సిందే..
  • మొబైల్‌ యాప్‌ నుంచి ఏ రోజుకారోజు నడక వివరాల నమోదు
  • 45 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు
  • సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే.. వారి కుటుంబం ఆనందంగా ఉంటుంది
  • హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

నడక.. దీర్ఘాయువుకు నిచ్చెన వేస్తుంది. చక్కటి ఆరోగ్యానికి బాటలు పరుస్తుంది. గుండె లయ అదుపు తప్పకుండా సమస్థితిలో ఉంచుతుంది. చెప్పాపెట్టకుండా ముసురుకొచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. పరుగు పోటీలా మారిన జీవన శైలి ధాటికి.. మధ్య వయసులో వచ్చే వ్యాధులన్నీ యుక్తవయసులోనే దాడి చేస్తున్న వేళ నగర పోలీసు విభాగం తమ సిబ్బంది ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఓ మేలైన నిర్ణయం తీసుకున్నది. ప్రతి పోలీసు అధికారి రోజూ తప్పనిసరిగా వాకింగ్‌ చేయాలంటూ ఆరోగ్య నిర్దేశం చేసింది. యువ అధికారులైతే 10వేల అడుగులు, సీనియర్‌ అధికారులైతే 7వేల అడుగులు తప్పనిసరిగా వేయాలని సూచించింది. ఎన్ని అడుగులు వేశారో తమ మొబైల్‌ యాప్‌ల నుంచి ఏ రోజుకారోజు నడక వివరాలు ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. 45 రోజుల నుంచి అమలవుతున్న ఈ విధానాన్ని డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసు శాఖలో ఒత్తిడితో కూడుకున్న విధి నిర్వహణ వల్ల చాలామంది వ్యాయామం చేస్తుండడం లేదని గమనించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వ్యాయామాన్ని విధి నిర్వహణలో భాగంగా చేస్తే పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటారని తద్వారా వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆకాంక్షించారు.

కేసుల విచారణ.. చేధన.. ప్రమాద స్థలాలకు వెళ్లడం.. బందోబస్తు నిర్వహణ.. ఇలా ఒక్కటేమిటి నిరంతరం ప్రజా రక్షణలో పోలీసులు నిమగ్నమవుతారు. అహర్నిశలూ పౌరుల శ్రేయస్సుకు పాటుపడే పోలీసుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తున్నారు నగర పోలీసులు. విధిగా ప్రతి రోజూ వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. విధులు నిర్వహించే కార్యాలయంలోనే వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండేలా కృషి చేస్తున్నారు. యువకులైతే 10వేల అడుగులు, సీనియర్‌ అధికారులైతే కనీసం 7వేల అడుగులు నడవాలనే నిబంధన పెట్టారు. సెల్‌ఫోన్‌లలో ఉండే వ్యాయామ యాప్‌ల ద్వారా ఎన్ని అడుగులు నడిచారనేది రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపించాలని, సిబ్బంది నడక వివరాలను ప్రతి రోజూ డీసీపీలు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. దీంతో నగర పోలీసులందరూ విధిగా వ్యాయామం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నగరంలో నేరాలను నివారించి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకమైంది. ఇందుకు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఉన్న సమయాన్ని విధులకే కేటాయిస్తున్నారు. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ 45 రోజుల క్రితం నగర పోలీసు అధికారులు తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు ఏదో ఒక సమయంలో నడక తప్పనిసరి చేసుకోవాలంటూ సూచనలు చేశారు. అందరూ తమ మొబైల్స్‌లో వ్యాయామానికి సంబంధించిన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అందులో ప్రతి రోజు మీరు ఎన్ని అడుగులు నడిచారనే కచ్చితమైన లెక్కను చూసుకోవాలంటూ సూచించారు. కొత్తగా విధుల్లో చేరిన యువకులు 10 వేలకుపైగా అడుగులు, కొంత వయసు ఎక్కువగా ఉండే ఏసీపీలపై స్థాయి అధికారులు తమ వయసు మేరకు 7 వేల వరకు నడవాలని సూచించారు. సిబ్బంది హెల్త్‌పై ఐదు జోన్లలోనిజోన్లలోని డీసీపీలు రోజు వారీగా పరిశీలన చేయాలని ఆదేశించారు.

5 నుంచి 8 కిలోమీటర్ల నడక

సాధారణంగా వ్యక్తుల వయసు, వారు వేసే అడుగును బట్టి దూరం లెక్కిస్తారు. 10 వేల అడుగులు వేశారంటే సుమారు 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం నడిచినట్లవుతుంది. ఒకేసారి 10 వేల అడుగులు నడవాల్సిన పని ఉండదు. రోజంతా కార్యాలయంలో ఒక చోట కూర్చోకుండా అప్పుడప్పుడు అటూ ఇటు తిరుగుతున్నా ఈ అడుగులు లెక్కలోకి వస్తాయి. మరోవైపు నగర పోలీస్‌స్టేషన్లలో జిమ్‌లను ఏర్పాటు చేసి సాయంత్రం వేళలో వ్యాయామం చేసేలా కృషి చేస్తున్నారు. సమయం దొరికిందంటే వ్యాయామం చేయాలనే ఆలోచనతో సిబ్బంది ఉండి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

హెల్‌కేర్‌ యాప్‌లెన్నో..

స్టెప్‌ ట్రాకర్‌, గూగుల్‌ పిట్‌, యాక్టివిటీ ట్రాకర్‌, మై పిట్‌నెస్‌ పాల్‌, ఫిట్‌ బిట్‌, పేసర్‌ సేసర్‌ వంటి యాప్‌లతోపాటు ఆయా కంపెనీలు తమ సెల్‌ఫోన్లలో తప్పనిసరిగా వ్యాయామానికి సంబంధించిన యాప్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలాంటి యాప్‌లలో రోజు వారి నడకకు సంబంధించిన వివరాల స్క్రీన్‌ షాట్‌ను పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులకు తమ స్టేషన్‌ ఉన్నతాధికారుల ద్వారా పంపిస్తున్నారు.

నడక ఆరోగ్యానికి మంచిది

ఇతర వ్యాయామాల కంటే నడక ఆరోగ్యానికి మంచిదని ఉస్మానియా ఎండ్రోక్రనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాకేశ్‌ సాహే తెలిపారు. నడకతో బీపీ, షుగర్‌ అదుపులో ఉండటమే కాకుండా రక్తప్రసరణ సజావుగా సాగుతుందని, దీంతో గుండె సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ఇతర వ్యాయామాలు అందరూ చేయలేరని, కానీ అన్ని వయసుల వారు చేయగలిగే వ్యాయామం నడక ఒక్కటేనన్నారు. పోలీసులు ప్రతిరోజూ నడక సాగించడం వారి ఆరోగ్యానికి మంచిదన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

పోలీసులకు పని ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా రోజూ వ్యాయామం చేయాల్సిన అవసరముంది. అందుకోసమే ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించాం. దీనికి ప్రతి ఒక్కరూ స్పందించి ఎదో ఒక సమయంలో వాకింగ్‌, జాగింగ్‌ చేస్తున్నారు. నేను ప్రతి రోజు 7500 స్టెప్‌లు తప్పనిసరిగా చేసేలా చూసుకుంటున్నాను. విధి నిర్వహణలోనే దీనిని భాగం చేయడంతో పోలీసు కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఆనందం ఉంటుందని గుర్తించి వ్యాయామాన్ని అలవాటు చేసుకున్నారు. – నగర పోలీస్‌ కమిషనర్‌, అంజనీకుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నడవండి చాలు అదే పదివేలు

ట్రెండింగ్‌

Advertisement