సిటీబ్యూరో, జూన్ 6,(నమస్తే తెలంగాణ): ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహించే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి చెల్లించే వేతనాల్లో కోతలు పెడుతున్నారు. చాలీ చాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొట్టుస్తున్న తరుణంలో, ఇచ్చే వేతనంలో కూడా కాంట్రాక్టర్లు కోతలు పెట్టడం మూలంగా కుటుంబాలను పోషించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు మూడేండ్ల కిందట వేసిన టెండర్ల గడువు ముగిసినా కూడా నేటికి కొత్త టెండర్ల ప్రకటన చేయకుండా టీఎస్ఎంఐడీసీ కాలయాపన చేస్తున్నది.
జీవో 60 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు, వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందించడం లేదు. 100 పడకలకు 45 మంది చొప్పున శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తారు. వీరికి చెల్లించే వేతనం సైతం పడకల సామర్థ్యం ఆధారంగానే నిర్ణయిస్తారు. గతంలో ప్రతి బెడ్‌కు నెలకు రూ.5000 చెల్లించేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హరీశ్ రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే వారి సేవలను గుర్తించి రూ.5000 కు బదులు బెడ్‌కు రూ.7500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
వాటిని కొన్ని రోజులు సాఫీగా అమలు చేసినా కాంట్రాక్టర్లు దాన్ని విస్మరించారు. ప్రస్తుతం ఈ సిబ్బందికి చెల్లించే రూ.15,600 వేతనంలో కోతలు పెట్టి చివరికి రూ.11,600 చెల్లిస్తుండటం గమనార్హం. ఏజెన్సీలు సకాలంలో పీఎఫ్, ఈఎస్ఐలు చెల్లించకుండా సిబ్బంది వేతనాల్లో కటింగ్ పెట్టడంతో ఆ సిబ్బంది మదనపడుతున్నారు. ఆసుపత్రుల్లో ఏజెన్సీల గడువు పూర్తయి నెలలు గడుస్తున్నా కూడా టీఎస్ఎంఐడీసీ అధికారులు కొత్త టెండర్‌కు ప్రకటన జారీ చేయలేదు.
ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలి. కొత్త టెండర్లు పిలిచి సిబ్బందికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-నర్సింహ, మెడికల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఏఐటీయూసీ
గ్రేటర్లో ఉన్న నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, కింగ్ కోఠీ జిల్లా, పేట్లబుర్జ్ ఆసుపత్రుల్లో సుమారు 2500 మంది సిబ్బంది శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరంతా ఏజెన్సీ ద్వారా పొరుగు సేవల ప్రాతిపాదికన విధులు నిర్వహిస్తున్న మూలంగా వీళ్లందరి వేతనాలు సైతం ప్రతినెలా ఏజెన్సీనే చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఏజెన్సీలు సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోగా, ప్రతినెల ఇచ్చే వేతనంలో కూడా కోతలు పెడుతున్నారు.