సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ) : రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టితో కలిసి రిటర్నింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలైన ర్యాంప్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారి తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పారింగ్ స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్దేశించిన ఓటర్లు దాటిన పక్షంలో పోలింగ్ కేంద్రాల్లో ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని చెప్పారు. రాజకీయ నాయకుల ద్వారా ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీఎల్ఓలపై కఠినంగా వ్యవహరించాలని అర్ఓలను ఆదేశించారు. ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లను రీ-చెక్ చేసుకోవడానికి కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి సులువుగా చేరే విధంగా రూట్ మ్యాప్‌ను రూపొందించి గూగుల్ మ్యాప్‌లో పొందుపర్చాలని తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో కె్లైమ్స్ అండ్ ఆబ్జక్షన్స్ వేగవంతంగా పూర్తి చేయాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్టెటెడ్, డెత్) లిస్ట్‌లను బీఎల్ఓ సేకరించి రిటర్నింగ్ అధికారులు రాజకీయ పార్టీల ఏజెంట్లకు సమాచారం అందించాలని తెలిపారు. పోలింగ్ రోజు ఏఎస్డీ జాబితాలో ఉన్న ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చినచో సరైన డాక్యుమెంట్లను పరిశీలించి ఓటు హకు కల్పించి, ఆ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి ఓటరు ఫోన్ నంబర్లను సేకరించాలని, తద్వారా వారికి ఎస్ఎంఎస్ ద్వారా ఓటు వినియోగించుకోవడానికి సంక్షిప్త సమాచారాన్ని అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, ఖైరతాబాద్ ఆర్ఓ, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దొత్రె, యాకత్‌పుర ఆర్ఓ వెంకటచారి, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్స్ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.