KCR Birthday | ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ప్రారంభించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హామీల అమలు నుంచి తప్పించుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగబోయారని దుయ్యబట్టారు. ఓయూ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. కనీస విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల పాలిట శాపమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమల్ల రాకేశ్, బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, తొట్ల స్వామియాదవ్, మంద సురేశ్, పడాల సతీశ్, కడారి స్వామియాదవ్, టైగర్ రఘురాం, అవినాశ్, చందు, వెంకట్, నవీన్ గౌడ్, జంగయ్య, మిథున్ ప్రసాద్, నాగారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.