సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): చరిత్రాత్మక జలాశయం హుస్సేన్‌సాగర్ తీరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కు ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు రూ.26.65 కోట్ల వ్యయంతో సరికొత్త థీమ్‌లతో రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్కును గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఆ తర్వాత హుస్సేన్‌సాగర్ చుట్టూ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పార్కులన్నీ మూసివేయడంతో సందర్శకులను అనుమతించలేదు. ప్రస్తుతం నిమజ్జనాలు ముగియడంతో ఆదివారం నుంచి కొత్తగా నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కులోకి సందర్శకులను అనుమతిస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. లేక్ ఫ్రంట్ పార్కు ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ఉదయం 5 నుంచి 9 గంటల వరకు వాకర్స్ టైమింగ్‌గా నిర్ణయించారు. నెలకు రూ.100 చొప్పున చెల్లించి మార్నింగ్ వాక్ చేసే సదుపాయాన్ని నగర వాసులు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. అదేవిధంగా లేక్‌ఫ్రంట్ పార్కులో రూ.11వేలు చెల్లించి పుట్టినరోజు వేడుకలు, గెట్ టు గెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంద మంది మించకుండా చేసుకునే వారికి హెచ్ఎండీఏ ఈ సదుపాయాన్ని కల్పిస్తుందని తెలిపారు. ఈ కరాచీ బేకరీ అవుట్ లెట్తోపాటు మరికొన్ని అవుట్ లెట్స్ సందర్శకుల కోసం ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.