Jawaharnagar | జవహర్‌నగర్, సెప్టెంబర్ 5: జవహర్‌నగర్ కార్పొరేషన్లో హైడ్రా అధికారుల పర్యటనతో పేద ప్రజల్లో భయందోళన మొదలైంది. ఏండ్లుగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నాం.. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నాం.. ప్రజా పాలనలో తమ బతుకులు మారుతాయనుకుంటే… బుల్డోజర్ తీసుకు వస్తుండటంతో తమ బతుకులు ఆగమ్యగోచరంగా మారుతున్నాయని అంబేద్కర్‌నగర్ ఇందిరమ్మ చెరువు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
తమ ఇళ్లలోకి ఎప్పుడు నీరు రాలేదు.. చిన్నపాటి రేకుల ఇంటిని నిర్మించుకుని పాములు, తేళ్ల మధ్య జీవనం వెళ్లదీస్తున్నాం.. పెద్దలపై చూపించే ప్రతాపం పేద బతుకులపై చూపితే తమ ఉసురు ప్రభుత్వానికి తాకుతదని..ఎల్లకాలం ప్రభుత్వం ముందుకు సాగదని కన్నీటి పర్యంతమవుతూ శాపనార్ధాలు పెట్టారు. కూలినాలీ చేసుకుని ప్లాటు కొనుక్కొని చిన్నపాటి గూడును కట్టుకుని నివసిస్తున్నామన్నారు. రేణుకానగర్‌లో బంగ్లాలు లేవు… పేదలు బతికే కాలనీపై ప్రభుత్వం కనికరం చూపకుంటే 60 కుటుంబాలు రోడ్డుపాలవుతాయని కన్నీటి పర్యంతమయ్యారు.
20 ఏండ్ల నుంచి చిన్నపాటి ఇంటిని నిర్మించుకుని బతుకుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం మా ఇండ్లకు 58 జీవో కింద పట్టాలు ఇచ్చి మాకు భరోసా కల్పిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో మా నోట్లో మట్టి కొట్టాలని చూస్తుంది. చెరువుతో మాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. మా రేణుకానగర్ను గత సర్కార్ ఇబ్బంది పెట్టలేదు. హైడ్రా మా లాంటి పేదల ఇండ్లను కూల్చడానికే వచ్చినట్టుంది. చిన్నపిల్లలతో కాలం వెళ్లదీస్తున్నాం. మా కుటుంబాలపై దయచూపి ప్రభుత్వం ఆదుకోవాలి.. లేకుంటే మా చావులను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తది.
– సత్తయ్య, రేణుకానగర్ అంబేద్కర్‌నగర్
ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం. మా కాలనీకి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ లాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇందిరమ్మ చెరువు పరిశీలనకు వచ్చినప్పటి నుంచి మాకు భయం పట్టుకుంది. కూలికి పోతేనే పొట్టగడిచే మా బతుకులపై ప్రభుత్వం కక్షగట్టినట్టు చేయడం దుర్మార్గం. చంటి పిల్లలతో జీవనం సాగిస్తున్నాం.. ఇండ్లను కూల్చితే ప్రభుత్వానికి మా ఉసురు తగులుతది. చెరువులో అక్రమంగా లే అవుట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– అంబిక, అంబేద్కర్‌నగర్ జవహర్‌నగర్
దివ్యాంగ కుమారుడితో బతుకు జీవుడా అంటూ జీవనం వెళ్లదీస్తున్నాం. చిన్న రేకుల ఇంటిని వేసుకుని 16 ఏండ్ల నుంచి బతుకుతున్నా. చెరువుకు దూరంలోనే మా కాలనీ ఉంది. అక్రమార్కులు చెరువును కబ్జా చేసుకుని ప్లాట్లుగా మార్చి కోట్లు సంపాదించారు. కూడ బెట్టిన సొమ్ముతో ప్లాటు కొనుక్కొని.. కొంత మంది సాయం చేయడంతో ఇల్లు కట్టుకొని జీవిస్తున్నా.. చెరువును మట్టితో నింపిన వారిపై హైడ్రా ప్రతాపం చూపాలి. మాలాంటి పేద కుటుంబాలను ఆదుకోవాలి. మాకు సహకారం అందించాలి.
– అరుణబాయ్, అంబేద్కర్‌నగర్ జవహర్‌నగర్