సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ ): అది గ్రేటర్‌లోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం.. నిబంధనల ప్రకారం అంగుళం అటు ఇటు అయినా నోటీసులు పంపాల్సిన చోటు.. కానీ, అకడ కాసుల గలగల ముందు చట్టం మూగబోయింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల అవినీతి దాహానికి బౌండరీలు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణం అని తేలి, నోటీసులు ఇచ్చి, స్వయంగా అధికారులే సీజ్ చేసిన భవనాన్ని..ముడుపులందుకుని సదరు అక్రమ భవనాన్ని సక్రమంటూ అనుమతులు మంజూరు చేయడం ఇప్పుడు విస్తుగొలుపుతోంది. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే చుట్టూ తిప్పించుకునే యంత్రాంగం, ఇంటి అనుమతిలో చిన్న అక్రమమని తేలితే ఓసీ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టే అధికారులు… భారీగా ముడుపులు చెల్లించే బడాబాబులకు మాత్రం నిర్మాణాల్లో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘంచిన వారికి రెడ్ కార్పెట్ పరచడం గమనార్హం.
ఖైరతాబాద్ జోనల్ కార్యాలయ పరిధిలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మెట్రో ఫిల్లర్ సీ 1591 సమీపంలో ఓ బడాబాబు చేపడుతున్న నిర్మాణం వెనుక అధికారులు జరిపిన అక్రమ తంతును పరిశీలిస్తే..జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో ప్లాట్ నంబరు 96 (996.8 స్కేర్ మీటర్ల)లో సంపన్న వర్గానికి చెందిన యాజమాని సిల్ట్+నాలుగు అంతస్తులతో కమర్షియల్ భవనానికి ఖైరతాబాద్ జోనల్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా…క్షేత్రస్థాయిలోని టౌన్ ప్లానింగ్ అధికారులు 28 ఆగస్టు 2022న (ఫైల్ నంబరు. 008647/జీహెచ్ఎంసీ/4265/ఖైరతాబాద్ 2/2022-బీపీ) పేరుతో పర్మిషన్ ఫీజు రూ.17.46 లక్షలు చెల్లించాలంటూ సదరు యాజమానికి అధికారులు ఫీజు లెటర్ పంపించారు.
అంతలోనే నిర్మాణం చేపడుతున్న స్థలంపై వివాదాలు నెలకొనడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉందంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు సదరు భవనాన్ని సీజ్ చేశారు. ఈ విషయంలో అనుమతి నుంచి అక్రమ నిర్మాణ పనులు కొనసాగించే వరకు అప్పటి అధికారులు సదరు యజమాని నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు అరోపణలు వచ్చాయి. కొందరు అధికారుల ప్రోత్సహంతో పైకి సీజ్ ఉన్నా..లోలోనా పనులు జరుగుతుండడంతో ఈ భవన నిర్మాణంపై భారీ ఎత్తున ఫిర్యాదులు రావడం, అధికారుల తనిఖీల్లోనూ సెట్బ్యాక్లు పాటించకపోవడం, రోడ్డు ఎఫెక్ట్ ఉండడం, సెల్లార్ తవ్వకం వంటి వాటిపై ఫిర్యాదులు అధికం కావడంలో సదరు భవనాన్ని సీజ్ చేస్తూ వచ్చారు.
అయితే అంతా అనుకున్నట్లు ముడుపులు అందడంతో సీజ్ చేసిన బిల్డింగ్‌కు దొడ్డిదారిలో అనుమతులు మంజూరు చేసి తమ చేతివాటం ప్రదర్శించారు. పాత ఫైల్ నంబరు(008647)తోనే గత నవంబరు 11న బిల్డింగ్ పర్మిషన్ను ఇచ్చారు. వాస్తవంగా నగరంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణం జరిగితే నోటీసులు ఇవ్వడం, కుదిరితే కూల్చివేయడం, లేదా సీజ్ చేయడం నిబంధన..కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. అన్ని నిబంధనలను తుంగలో తొక్కి చేపట్టిన ఓ భవనాన్ని గతంలో అధికారులు సీజ్ చేయడం, తిరిగి ఆ భవనానికే మళ్లీ అనుమతి ఇచ్చిన తీరులో తెరవెనుక భారీ స్థాయిలో లావాదేవీలు నడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీజ్ చేసి.. సీన్ మార్చేశారు
సదరు యాజమాని త్వరగా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకుని కండ్లు చెదిరే బార్, ఇతర కార్యకలాపాలు నిర్వహించాలని భావించి నిర్మాణం చేపడితే …క్షేత్రస్థాయిలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన అని అధికారుల పరిశీలనలో తేలింది. సదరు యాజమానికి అవకాశాన్ని అసరా చేసుకున్న కొందరు సీజ్ చేసిన భవనాన్ని చకచకా పూర్తి చేసే బాధ్యతలు తీసుకున్నారు. బల్దియాలో ఓ పెద్ద మనిషి మనుషులు ఇద్దరు రంగంలోకి దిగి సదరు యజమానితో బిగ్ డీల్ కుదుర్చుకుని , కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రాత్రికి రాత్రే అడ్డదారిలో ఫైల్‌ను ఎంట్రీ చేసి నిర్మాణాన్ని తుది దశకు చేర్చారు.
ఉన్నతాధికారులంతా జీహెచ్ఎంసీలో పురపాలికల విలీనం, వార్డుల పునర్విభజనలో ఉండగా, అడ్డదారిలో ఓసీ ఇచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా ఈ అక్రమ భవనాన్ని సక్రమం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అసలు పర్మిషన్ సాధ్యం కానీ చోట అనుమతి ఇవ్వడం, సీజ్ చేసిన భవనానికి మళ్లీ అనుమతులు ఎలా వస్తాయని స్థానికులు విస్తుపోతున్నారు. ఆపై ఇంఫాక్ట్ ఫీజు, ఇతర ఉల్లంఘనలు ఉన్నప్పటికీ సదరు కమర్షియల్ భవనంలో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతుండటంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సీజ్ చేసిన భవనానికి అనుమతులు ఎలా ఇచ్చారో ఉన్నత స్థాయి విచారణ జరిపితే, బడా బాబుల అవినీతి బయటపడటం ఖాయమని, కమిషనర్ కర్ణన్, సీసీపీ శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.